నార్త్ లో నిఖిల్ సినిమా ప‌రిస్థితి ఏంటీ?

Update: 2022-08-16 13:30 GMT
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ న‌టించిన సూప‌ర్ నేచుర‌ల్ మిస్టిక్ థ్రిల్ల‌ర్ `కార్తికేయ 2`. అనేక అవాంత‌రాల మ‌ధ్య ఫైన‌ల్ గా ఆగ‌స్టు 13న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ మూవీ వ‌సూళ్ల ప‌రంగా స‌క్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం వ‌చ్చిన `కార్తికేయ‌` చిత్రానికి కొన‌సాగింపుగా యువ ద‌ర్శ‌కుడు చందూ మొండేటి తెర‌కెక్కించిన ఈ మూవీ యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియ‌న్స్ ని కూడా ఆక‌ట్టుకుంటోంది.

ఈ సినిమా విడుద‌లై మంగ‌ళ‌వారానికి నాలుగు రోజులు అవుతున్న నేప‌థ్యంలో ఫ‌స్ట్ డే కంటే దేశ వ్యాప్తంగా ఈ మూవీకి క‌లెక్ష‌న్స్ థియేట‌ర్లు కూడా పెర‌గ‌డం విశేషం. ఈ నేప‌థ్యంలో ఈ మూవీ ఇప్ప‌టికే ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ ని సాధించినట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. సంప్ర‌దాయానికి భిన్నంగా శ‌నివారం విడుద‌లైన ఈ మూవీకి శ‌ని, ఆదివారాల‌తో పాటు సోమ‌వారం ఇండిపెండెన్స్ డే కూడా బాగా క‌లిసి వ‌చ్చిన‌ట్టుగా ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఇదిలా వుంటే ఈ మూవీని నార్త్ లో ఎవ‌రు ప‌ట్టించుకుంటార‌నే కామెంట్ లు వినిపించాయి. హిందీ బెల్ట్ లో పెద్ద‌గా టీమ్ ప్ర‌చారం కూడా చేయ‌లేదు. అంతే కాకుండా ఈ మూవీకి ఉత్త‌రాదిలో పెద్ద‌గా థియేట‌ర్లు కూడా ల‌భించ‌లేదు. కార‌ణం.. అదే స‌మ‌యంలో బాలీవుడ్ స్టార్స్ అమీర్ ఖాన్ న‌టించిన `లాల్ సింగ్ చ‌డ్డా, అక్ష‌య్ కుమార్ న‌టించిన `ర‌క్షా బంధ‌న్‌` ఆగ‌స్టు 11న విడుద‌ల‌య్యాయి.

దీంతో `కార్తికేయ 2`కు నార్త్ లో పెద్ద‌గా థియేట‌ర్లు ల‌భించ‌లేదు. అయితే టాక్ ని బ‌ట్టి డే 1, డే 2, డే 3 ఇలా క్ర‌మ క్ర‌మంగా మేక‌ర్స్ థియేట‌ర్స్ పెంచుకుంటూ వెళుతున్నారు. ఇదే ఇప్ప‌డు ఈ మూవీకి ప్ర‌ధానంగా ప్ల‌స్ అయింద‌ని తెలుస్తోంది. అంతే కాకుండా శ్రీ‌కృష్ణుడి ర‌హ‌స్యాల‌పై తెర‌కెక్కిన సినిమా కావ‌డంతో నార్త్ ఆడియ‌న్స్ ఈ మూవీకి ఫిదా అయిపోతున్నార‌ట‌. దీంతో ఈ మూవీకి ముందు రోజు కేవ‌లం రూ. 7 ల‌క్ష‌లు మాత్ర‌మే రాగా అది ఆదివారానికి 28 ల‌క్ష‌ల‌కు చేరింది.

ఫైన‌ల్ గా సోమ‌వారం వ‌సూళ్లు కోటీ 10 ల‌క్ష‌ల‌కు పెర‌గ‌డం విశేషం. దీన్ని బ‌ట్టే రానున్న రోజుల్లో `కార్తికేయ 2` మిందీ బెల్డ్ లో స్వైర విహారం చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ముంబైలో ముందు రోజు కేవ‌లం 8 షోలు మాత్ర‌మే ర‌న్న‌యితే ఇప్ప‌డు ఏకంగా 120 షోలు ప్ర‌ద‌ర్శించ‌డాన్ని బ‌ట్టి ప‌రిస్థితి ఎలా మారుబోతోందో అర్థం చేసుకోవ‌చ్చ‌ని అక్క‌డి ట్రేడ్ అన‌లిస్ట్ లు చెబుతున్నారు.

ఈ మూవీకి ప్రేక్ష‌కుల నుంచి ల‌భిస్తున్న ఆద‌ర‌ణ చూస్తుంటే పుష్ప‌, ది క‌శ్మీర్ ఫైల్స్ లా క్రేజ్ ని సొంతం చేసుకుంటున్న‌ట్టుగా   స్ప‌ష్టం అవుతోంది. నార్త్ లో గ‌న‌క ఈ మూవీ ఇదే ఊపుని మ‌రింత‌గా కొన‌సాగిస్తే నిఖిల్ కెరీర్ లో బిగ్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిల‌వ‌డం ఖాయం అని చెబుతున్నారు.
Tags:    

Similar News