'కొండా' ట్రైలర్-2: క్రైమ్ కొన్నిసార్లు మంచితనం నుంచే పుడుతుందట..!

Update: 2022-06-03 08:34 GMT
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వాస్తవ సంఘటనలు - నిజ జీవిత చరిత్రలను తెరపై ఆవిష్కరించడంతో సిద్ధహస్తుడనే సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సినీ రాజకీయ ప్రముఖుల బయోపిక్స్.. శృంగార తారల లైఫ్ స్టోరీలు - గ్యాంగ్ స్టర్ జీవితాల ఆధారంగా సినిమాలు రూపొందించారు. ఇప్పుడు ''కొండా'' అనే మరో బయోపిక్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

తెలంగాణ ప్రాంతంలోని వరంగల్ రాజకీయాల్లో చక్రం తిప్పిన కొండా ముర‌ళి - సురేఖ‌ దంపతుల జీవిత కథ ఆధారంగా ''కొండా'' చిత్రాన్ని తెరకెక్కించారు ఆర్జీవీ. ఇందులో కొండా ముర‌ళి పాత్ర‌లో యువ హీరో త్రిగుణ్ నటించగా.. సురేఖ పాత్ర‌లో 'భైర‌వ‌గీత' ఫేమ్‌ ఇర్రా మోర్ కనిపించనుంది. రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు రామ్ గోపాల్ వర్మ.

ఇప్పటికే 'కొండా' నుంచి వచ్చిన టీజర్ - ట్రైలర్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఈ క్రమంలో తాజాగా ఆర్జీవీ సెకండ్ ట్రైలర్ ను లాంచ్ చేశారు. 'క్రైమ్ కొన్నిసార్లు మంచితనం నుంచి పుడుతుంది' అని కొండా మురళి చెప్పినట్లు పేర్కొనడంతో ఈ ట్రైలర్ ప్రారంభమతుంది. ఇది వర్మ గత చిత్రాల మాదిరిగానే వైలెన్స్ తో నిండిపోయింది.

'పెత్తందార్లు పెత్తనం భరించలేక కొంతమంది బడుగు వర్గాలు తిరగబడి మొత్తం వ్యవస్థ మీద పోరాడుతున్న రోజులవి. విపరీత పరిస్థితుల నుంచే విపరీత వ్యక్తులు ఉద్భవిస్తారని కారల్ మార్క్స్ 180 సంవత్సరాల క్రితం చెప్పాడు. అలాంటి విపరీత పరిస్థితుల్లో పుట్టినవాడే కొండా మురళి..' అని ఆర్జీవీ వాయిస్ ఓవర్ తో మురళి జీవితంలోని ఆసక్తికర సన్నివేశాలతో ఈ వీడియోని కట్ చేశారు.

వరంగల్ లో 1990ల నాటి సాంఘిక ఆర్థిక రాజకీయ పరిస్థితులను 'కొండా' సినిమాలో చూపించనున్నారు రామ్ గోపాల్ వర్మ. కొండా మురళి- సురేఖ జంట కాలేజీ ప్రేమాయణం మొదలుకొని.. ఉద్యమంలో చేసి ప్రజలకు అండగా నిలబడటం.. చివరకు ఈ ప్రయాణం రాజకీయాల వైపు సాగడం వరకూ తెరపై చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

''కొండా'' చిత్రాన్ని యాపిల్ ట్రీ/ఆర్జీవీ నిర్మాణంలో శ్రేష్ఠా పటేల్ మూవీస్ సమర్పణలో కొండా సుష్మిత పటేల్ నిర్మించారు. జూన్ 23న ఈ బయోపిక్ ని థియేటర్లలోకి తీసుకురానున్నారు. గత కొంతకాలంగా వర్మ తీసిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోవడం లేదు. మరి ఇప్పుడు కొండా దంపతుల మీద తెరకెక్కించిన ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


Full View
Tags:    

Similar News