అల్లువారిని ఇరుకున పెట్టేసిన రామారావు

Update: 2018-07-04 03:32 GMT
మెగాస్టార్ చిరంజీవితో అల్లు అరవింద్ తర్వాత అత్యధిక సినిమాలు నిర్మించిన ప్రొడ్యూసర్లలో కె.ఎస్.రామారావు ఒకరు. ఒక సమయంలో రామారావుతో వరుసగా సినిమాలు చేశాడు చిరు. వీళ్ల కాంబినేషన్లో ‘అభిలాష’.. ‘ఛాలెంజ్’.. ‘రాక్షసుడు’.. ‘మరణ మృదంగం’ లాంటి వరుస హిట్లు వచ్చాయి. ఐతే తాను ఇలా హిట్లు కొట్టడానికి.. పెద్ద నిర్మాతగా పేరు తెచ్చుకోవడానికి చిరంజీవి బావ అయిన అల్లు అరవింద్ కూడా ఒక రకంగా కారణమని.. ఆయనతో పాటు అశ్వినీదత్ నుంచి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని.. వారి స్ఫూర్తితోనే సినిమాలు నిర్మించానని చెప్పాడు రామారావు. ఇలా అల్లును పొగిడే క్రమంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అల్లు అరవింద్.. అశ్వినీదత్ ఇండస్ట్రీని శాసించే నిర్మాతలని రామారావు అన్నాడు.

ప్రస్తుతం ఇండస్ట్రీలో వైవిధ్యమైన.. గొప్ప సినిమాలు వస్తున్నాయంటే అందులో అరవింద్ పాత్ర చాలా కీలకమని రామారావు అన్నారు. ప్రస్తుతం 60 శాతం పరిశ్రమ అరవింద్ కనుసన్నల్లో నడుస్తోందని చెప్పారు. చిరంజీవి మెగాస్టార్ గా ఎదిగి.. అంత పెద్ద స్థాయికి వెళ్లారంటే అందుకు అరవింద్ ప్లానింగే కారణమని.. ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి 11 మంది హీరోలు పరిశ్రమలో ఉన్నారని.. వీళ్లందరూ ఇలా ఉన్నారన్నా కూడా అందుకు అరవిందే కారణమని చెప్పారు. ఐతే ఇండస్ట్రీని అరవింద్ శాసిస్తున్నారు.. ఆయన కనుసన్నల్లో పరిశ్రమ నడుస్తోంది.. మెగా ఫ్యామిలీ నుంచి 11 మంది హీరోలు పరిశ్రమలో హవా సాగిస్తున్నారు.. లాంటి పొగడ్తలు అరవింద్ కు.. మెగా ఫ్యామిలీకి కచ్చితంగా కొంచెం ఇబ్బంది కలిగించేవే. అల్లు వారిని బాగా పొగడాలన్న తాపత్రయంలో ఆయన్ని ఇబ్బంది పెట్టేశారు రామారావు. అనంతరం అరవింద్ మాట్లాడుతూ రామారావు మాటలన్నీ ఎగ్జాజరేషనే అని చెప్పగా.. అశ్వినీదత్ మాత్రం అవి అక్షరాలా నిజం అనడం విశేషం.
Tags:    

Similar News