సొంత డబ్బా కొట్టుకుంటున్న RRR..?

Update: 2022-04-07 08:31 GMT
'బాహుబలి' వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా ''ఆర్.ఆర్.ఆర్''. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంటి ఇద్దరు హీరోలు కలిసి తొలిసారిగా స్క్రీన్ షేర్ చేసుకున్నారు. భారీ అంచనాల నడుమ మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.

గత రెండు వారాల్లో మరే ఇతర పెద్ద సినిమా లేకపోవడంతో RRR చిత్రానికి జనం బ్రహ్మరథం పడుతుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక్క నైజాం ఏరియాలోనే రూ.100 కోట్లకు పైగా షేర్ వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు గ్రాండ్ గా పార్టీ కూడా ఇచ్చారు.

యూఎస్ఏ మరియ నార్త్ సర్క్యూట్స్ లో కూడా 'ఆర్.ఆర్.ఆర్' సినిమా మంచి వసూళ్ళు అందుకుంటున్నట్లు చెబుతున్నారు. అంత వచ్చాయి ఇంత వచ్చాయి అని అంటున్నారు కానీ.. రియల్ గా ఆ రెండు ఏరియాలలో ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వలేదని ట్రేడ్ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

హిందీలో RRR సినిమాని రిలీజ్ చేసిన పెన్ స్టూడియోస్ అధినేత జయంతిలాల్ గడ బుధవారం సాయంత్రం ముంబైలో గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేసారు. దీనికి రాజమౌళి - రామ్ చరణ్ - ఎన్టీఆర్ లతో పాటుగా అమీర్ ఖాన్ - కరణ్ జోహార్ - జావేద్ అక్తర్ - జానీ లీవర్ వంటి పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా RRR సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేసినట్లు కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. మూవీ కలెక్షన్స్ వివరాలు తెలుపుతూ మేకర్స్ అధికారిక పోస్టర్ ఏదీ రిలీజ్ చేయలేదు. కానీ ముంబై ఈవెంట్ లో ఎక్కడ చూసినా '1000 కోట్లు' అంటూ హడావిడి చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా ప్రమోషన్స్ లో భాగంగానే జరిగిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మూడో వారంలో జనాల దృష్టిని ఆకర్షించడానికి ఇలాంటి స్పెషల్ పార్టీలు - ఈవెంట్స్ నిర్వహిస్తున్నారేమో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా మరో వారం వరకూ పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద RRR కు పోటీగా వచ్చే సినిమా ఏదీ లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో మ్యాజిక్ ఫిగర్ 1000 కోట్ల మార్క్‌ ను టచ్ చేయడమే కాదు.. అంతకంటే ఎక్కువ వసూళ్ళు అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Tags:    

Similar News