చిన్న సినిమాల వరద బాబోయ్

Update: 2016-09-12 22:30 GMT
‘జనతా గ్యారేజ్’ సందడి ముగిసిపోయింది. ఇక మళ్లీ ఆ స్థాయి పెద్ద సినిమా రావడానికి చాలా టైం పడుతుంది. ఇక అంతా మీడియం.. చిన్న రేంజి సినిమాలదే హవా. ఇక ప్రతి శుక్రవారం కనీసం రెండు సినిమాలైనా రేసులో ఉండటం గ్యారెంటీ. లాస్ట్ వీకెండ్లో ఇంకొక్కడు.. జ్యో అచ్యుతానంద వచ్చాయి. రాబోయే వీకెండ్లో ఏకంగా అరడజను సినిమాలు రిలీజవుతుండటం విశేషం. అందులో నాగార్జున నటించి.. నిర్మించిన ‘నిర్మలా కాన్వెంట్’ ఒక్కటే చెప్పుకోదగ్గ సినిమా. మిగతావన్నీ ఏదో క్లియరెన్స్ సేల్ లో వస్తున్నట్లుగా ఉన్నాయి. ‘మొగిలి రేకులు’ సీరియల్ తో సూపర్ పాపులారటీ సంపాదించిన సాగర్ హీరోగా నటించిన ‘సిద్ధార్థ’ ఈ శుక్రవారమే రిలీజవుతుంది. ఈ సినిమా ఎప్పట్నుంచో విడుదల కోసం ఎదురు చూస్తోంది.

మరోవైపు రష్మి ప్రధాన పాత్రలో నటించిన థ్రిల్లర్ మూవీ ‘చారుశీల’ కూడా ఆ రోజే వస్తుంది. ఇవి కాకుండా కోటి తనయుడు రాజీవ్ కథానాయకుడిగా నటించిన ‘ప్రేమంటే సులువు కాదురా’.. కమెడియన్ ధన్ రాజ్ కీలక పాత్ర పోషించిన ‘సింపుల్ లవ్ స్టోరీ’.. విజయ్ డబ్బింగ్ సినిమా ‘మాస్ రాజా’.. ఇంకా అత్తారిల్లు.. లవ్ కె రన్ అనే సినిమాలు కూడా ఈ శుక్రవారమే విడుదలకు రెడీ అవుతున్నాయి. వీటిలో చాలా వరకు ఏదో రిలీజ్ అయ్యాయంటే అయ్యాయి అనిపించే సినిమాలే. చాన్నాళ్లుగా విడుదల కోసం వెయిటింగులో ఉన్న నారా రోహిత్ సినిమా ‘శంకర’ ఈ శుక్రవారమే వస్తుందని ముందు ప్రకటించారు కానీ.. అనివార్య కారణాల వల్ల మరోసారి వాయిదా పడింది.
Tags:    

Similar News