మినీ రివ్యూ: 'అమ్ము'

Update: 2022-10-20 11:55 GMT
ఐశ్వర్య లక్ష్మి - నవీన్ చంద్ర - బాబీ సింహా ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ''అమ్ము''. చారుకేష్ శేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని కల్యాణ్ సుబ్రహ్మణ్యం మరియు కార్తికేయ సంతానం - కార్తీక్ సుబ్బరాజు సంయుక్తంగా నిర్మించారు. థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా అక్టోబర్ 19 నుండి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ట్రైలర్ తో ఆసక్తిని కలిగించిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దా!

కథలోకి వెళ్తే.. మంచి భర్త దొరకాలని అతనితో సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కలలు గనే మధ్యతరగతి యువతి అమ్ము (ఐశ్వర్య లక్ష్మీ). ఎన్నో ఆశలతో పోలీసాఫీసర్ రవీంద్రనాథ్ (నవీన్ చంద్ర) ని పెళ్లి చేసుకుంది. అంతా బాగానే ఉందనుకుంటుండగా కోపిష్ఠి అయిన రవీంద్రనాథ్.. అమ్ము ని మానసికంగా శారీరకంగా హింసించడం మొదలుపెట్టాడు. అవన్నీ భరిస్తూ వచ్చిన అమ్ము.. ఒకానొక సందర్భంలో ప్రభు (బాబీ సింహా) అనే క్రిమినల్ ని కలిసిన తర్వాత భర్తకు గుణపాఠం చెప్పాలని ఒక ప్లాన్ వేస్తుంది. ఇంతకీ అమ్ము వేసిన ప్లాన్ ఏంటి? ఈ నేపథ్యంలో ఆమె ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది? భర్తకు తగిన శాస్తి చేసిందా లేదా? ఆమె జీవిత పోరాటం ఎలా ముగిసింది? అనేది ''అమ్ము'' మిగతా కథ.

ప్రస్తుత సమాజంలో ఎందరో మహిళలు ఎదుర్కొంటున్న గృహ హింస వంటి బర్నింగ్ సమస్యపై రాసుకున్న కథతో వాస్తవికతను దగ్గరగా ఉండేలా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. స్లోగా ప్రారంభమై.. ప్రధాన పాత్రల డార్క్ సైడ్ ని అన్వేషించిన తర్వాత ఆసక్తికరంగా మారుతుంది. అమ్ము పాత్రలో తన సహజ నటనతో ఐశ్వర్య లక్ష్మి ఆకట్టుకుంది. భర్త వల్ల చిత్రహింసలను సహిస్తూ జీవించే భార్య పాత్రలో ఆమె ఒడిగిపోయింది. తన కెరీర్ లో మోస్ట్ ఛాలెంజింగ్ రోల్ కి ఆమె పూర్తి న్యాయం చేసిందని చెప్పాలి.

టాలెంటెట్ యాక్టర్ నవీన్ చంద్ర మరోసారి తన విలక్షణమైన నటనతో మెప్పించాడు. టఫ్ పోలీసాఫీసర్ గా.. ఇగోయిస్టిక్ - శాడిస్టిక్ భర్త పాత్రలో అద్భుతంగా నటించాడు. జాతీయ అవార్డ్ విన్నింగ్ నటుడు బాబీ సింహా కూడా ఎప్పటిలాగే ఆకట్టుకున్నాడు. రఘు బాబు - సత్య - మాల పార్వతి - ప్రేమ్ సాగర్ తదితరులు తమ పరిధి మేరకు నటించారు. పద్మావతి మల్లాది రాసిన సంభాషణలు సినిమాకు ప్లస్ అయ్యాయి.

అయితే 'అమ్ము' మూవీ డీసెంట్ గా ఉన్నప్పటికీ అక్కడక్కడా ల్యాగ్ సీన్స్ ఇబ్బంది పెడతాయి. కథా కథనాలు ఊహించిన విధంగా ఉండటం.. రిపీటెడ్ చూస్తున్నామనే భావన కలిగించడం కొంత నిరాశ కలిగిస్తుంది. అలానే బాబీ సింహా ట్రాక్ కు బలవంతంగా కథనంలో మిళితం చేసినట్లు అనిపిస్తుంది. ప్రభు పాత్ర అమ్ము కు సహాయం చేయడానికి సరైన కారణాన్ని చూపించలేదు. దర్శకుడు సినిమా క్లైమాక్స్ ని కూడా బాగా రాసుకుని హ్యాండిల్ చేసి ఉండవచ్చు.

సినిమాలో డైలాగ్స్ - బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ - విజువల్స్ బాగున్నాయి. పరిమిత బడ్జెట్ తో రూపొందించినా.. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు తగ్గట్టుగా ఉన్నాయి. ఎడిటింగ్ విషయంలో మాత్రం మరింత శ్రద్ధ తీసుకుని ఉండాల్సింది. మొత్తం మీద నేటి సమాజంలో స్త్రీల పై జరిగే గృహ హింస ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ''అమ్ము'' సినిమా చూడదగ్గ మంచి ప్రయత్నమని చెప్పాలి. స్క్రీన్ ప్లేలో కొన్ని లోపాలను పక్కనపెడితే.. ప్రధాన నటీనటుల అద్భుతమైన నటన మరియు లేవనెత్తిన సమస్య కోసం ఈ సినిమా తప్పకుండా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆస్వాదించవచ్చు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News