ధోని సినిమాకు అక్కడ బ్రహ్మరథమే

Update: 2016-10-03 22:30 GMT
ఇండియాలో ఇప్పటిదాకా వచ్చిన స్పోర్ట్స్ బయోపిక్స్ అన్నీ ఒకెత్తయితే.. ‘ఎం.ఎస్.ధోని’ మరో ఎత్తు అని చెప్పాలి. ఇంతకుముందు ఏ స్పోర్ట్స్ బయోపిక్ కూ లేనంత హైప్ వచ్చింది ఈ సినిమాకు. ఓపెనింగ్స్ కూడా అదిరిపోయాయి. ఈ ఏడాది సల్మాన్ సినిమా ‘సుల్తాన్’ తర్వాత అత్యధిక ఓపెనింగ్స్ తెచ్చుకున్నది ఈ సినిమానే. తొలి వారాంతంలో ఇండియా వరకే రూ.65 కోట్ల దాకా వసూలు చేసింది ధోని సినిమా.

విశేషం ఏంటంటే.. ‘ఎం.ఎస్.ధోని’ హవా కేవలం హిందీ వెర్షన్ వరకే పరిమితం కాలేదు. రీజనల్ లాంగ్వేజెస్ లో కూడా ఈ సినిమా జోరు చూపిస్తోంది. తెలుగు వెర్షన్ కు సైతం మంచి స్పందన వచ్చింది. చెప్పుకోదగ్గ వసూళ్లే వచ్చాయి. ఇక తమిళనాట అయితే ‘ఎం.ఎస్.ధోని’ హవా మామూలుగా లేదు. అక్కడ ఈ సినిమాను 250 దాకా థియేటర్లలో రిలీజ్ చేశారు. మామూలుగా ఓ మోస్తరు సినిమాలకే ఈ మాత్రం థియేటర్లు దక్కుతాయి. తొలి రోజు ‘ఎం.ఎస్.ధోని’ రూ.2 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. వీకెండ్ వసూళ్లు రూ.5 కోట్ల దాకా ఉన్నాయి.

మామూలుగా తమిళ ప్రేక్షకులు హిందీ డబ్బింగ్ సినిమాల్ని పట్టించుకోరు. కానీ ధోని సినిమా దానికి భిన్నం. తమిళ స్టార్ హీరోల సినిమాల తరహాలో దీనికి హైప్ కనిపించింది. ఐపీఎల్ లో ఎనిమిదేళ్ల పాటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడుతూ.. వాళ్ల సొంత మనిషిలా అయిపోయాడు ధోని. అతణ్ని చూస్తే చాలు తమిళ జనాలు ఆగలేరు. ధోనికి కూడా తమిళులంటే బాగా అభిమానమే. ఈ నేపథ్యంలోనే ధోని సినిమా కోసం అక్కడి ప్రేక్షకులు ఎగబడ్డారు. థియేటర్లు కళకళలాడాయి. వీకెండ్ తర్వాత కూడా వసూళ్లు బాగానే ఉన్నాయి. మొత్తంగా అక్కడ ‘ఎం.ఎస్.ధోని’ సూపర్ హిట్ రేంజికి వెళ్లేలా ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News