నితిన్ సాహసాలకు హద్దే లేకుండా పోయిందే!

Update: 2022-04-06 10:30 GMT
నితిన్ కి హిట్ తో ఎంత చనువు ఉందో .. ఫ్లాప్ తో అంత పరిచయం ఉంది. టీనేజ్ లో ఇండస్ట్రీకి వచ్చిన ఆయన, కొంతమంది యంగ్ హీరోలకంటే ఒకటి రెండు ఆకులు ఎక్కువే చదివాడు. సొంత నిర్మాణ సంస్థ ఉండటం వలన, ఆ వైపు నుంచి కూడా అవసరమైనదానికంటే ఎక్కువ అనుభవమే ఉంది. అందువలన ఎన్ని ఫ్లాపులు వచ్చినా ఆయన తడబడకుండా నిలబడ్డాడు. అత్యవసరమనుకున్నప్పుడు హిట్ కొట్టేసి మళ్లీ దార్లోపడిపోయాడు. అలాంటి నితిన్ ఈ మధ్య కాలంలో హిట్ అనే మాట వినేసి చాలా కాలమైంది.

'భీష్మ' సినిమా ఆయనకి భారీ సక్సెస్ ను అందించింది. ఇక నితిన్ నుంచి హిట్ల పరంపర మొదలైందని అంతా అనుకున్నారు. ఆ తరువాత ఆయన మాంఛి ఉత్సాహంతో వరుసగా మూడు ప్రాజెక్టులను పట్టాలెక్కించాడు. 'చెక్' .. 'రంగ్ దే' .. 'మాస్ట్రో' ఈ మూడు సినిమాలు కూడా ఒకదానికి మించి మరొకటి ఫ్లాప్ అయ్యాయి. అయినా ఎంత మాత్రం తగ్గకుండా నితిన్ అదే స్పీడ్ ను కంటిన్యూ చేస్తున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'మాచర్ల నియోజక వర్గం' సినిమా రూపొందుతోంది. జూలై 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

సాధారణంగా వరుసగా ఫ్లాపులు వస్తున్నప్పుడు, కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇవ్వడానికి ఎవరైనా ఆలోచిస్తారు. ఎందుకు వచ్చిన రిస్క్ అనుకుంటారు. అలాంటి ఒక ప్రాజెక్టు సొంత బ్యానర్లో చేయలవలసి వస్తే ఎందుకు వచ్చిన గోల ఇది అనుకుంటారు.

కానీ నితిన్ మాత్రం ఏ సినిమా రిజల్టును ఆ సినిమాకే వదిలేసి, తాను మాత్రం కొత్త దర్శకుడైన రాజశేఖర్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చాడు. వరుస ఫ్లాపులతో  ఉన్నప్పుడు ఈ విధమైన నిర్ణయం తీసుకోవడమనేది ఒక రకంగా సాహసం చేయడం వంటిదే. ఈ సినిమాలో ఆయన సరసన కథానాయికగా కృతి శెట్టి నటిస్తోంది.

ఇక ఇదో పెద్ద సాహసమే కాదన్నట్టుగా ఆయన ఆ తరువాత సినిమాను వక్కంతం వంశీ చేతిలో పెట్టడం విశేషం. వక్కంతం వంశీకి రైటర్ గా మంచి పేరు ఉంది. ఆయన కథలను అందుకుని వెళ్లిన ఎన్నో సినిమాలు విజయాలను అందుకుని వచ్చాయి. కానీ ఆయన మెగాఫోన్ పట్టుకుని చేసిన 'నా పేరు సూర్య' సినిమా మాత్రం వెల్లకిలా పడిపోయింది.

ఆ సినిమా ఫ్లాప్ నుంచి కోలుకోవడానికి బన్నీ లాంటి మాస్ హీరోకే చాలా టైమ్ పట్టేసింది. అలాంటి వక్కంతం వంశీతో సినిమా చేయడానికి నితిన్ అంగీకరించడం నిజంగా గొప్ప విషయమే. ఈ రెండు సినిమాలు హిట్ అయితే నితిన్ సాహసానికి ఒక అర్థం .. ఆయన ప్రయోగానికి ఒక పరమార్థం చేకూరినట్టే అనుకోవాలి!
Tags:    

Similar News