సినిమా రివ్యూ : పండగ చేస్కో

Update: 2015-05-30 04:44 GMT
రివ్యూ:   పండగ చేస్కో
రేటింగ్‌: 2.5 /5
తారాగణం: రామ్‌, రకుల్‌ ప్రీత్‌, సోనాల్‌ చౌహాన్‌, బ్రహ్మానందం, పవిత్ర లోకేష్‌, రావు రమేష్‌, సంపత్‌, సాయికుమార్‌, వెన్నెల కిషోర్‌, ఎమ్మెస్‌ నారాయణ, సురేఖావాణి, తేజస్వి, రఘుబాబు, పృథ్వీ, బ్రహ్మాజీ, షకలక శంకర్‌ తదితరులు
సంగీతం: థమన్‌
మాటలు: కోన వెంకట్‌
ఛాయాగ్రహణం: సమీర్‌ రెడ్డి
నిర్మాత: పరుచూరి కిరీటి
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోపీచంద్‌ మలినేని

        వరుసగా మూడు ఫ్లాపులు తిన్నాడు యువ కథానాయకుడు రామ్‌. ఒకప్పుడు ఇలాంటి స్థితిలోనే ఉన్న రవితేజను గోపీచంద్‌ మలినేని, కోన వెంకట్‌ జంట సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కించింది. రామ్‌ కూడా వాళ్లనే నమ్ముకున్నాడు. మరి ఫామ్‌లో ఉన్న డైరెక్టర్‌, స్టార్‌ రైటర్‌ కలిసి రామ్‌కు ఎలాంటి సినిమా ఇచ్చారో చూద్దాం పదండి.

కథ:
        డబ్బే సర్వస్వం అనుకునే యంగ్‌ బిజినెస్‌మేన్‌ కార్తీక్‌ (రామ్‌) తనలాగే ఆలోచించే స్వీటీ (సోనాల్‌ చౌహాన్‌)తో పెళ్లికి రెడీ అవుతాడు. ఆ సమయంలోనే ఇండియాలో ఉన్న తన ఫ్యాక్టరీకి ఏదో ఇబ్బంది వచ్చిందని ఫారిన్‌ నుంచి బయల్దేరతాడు కార్తీక్‌. ఇండియాకొస్తే పర్యావరణం కోసం పోరాడే దివ్య (రకుల్‌ప్రీత్‌) వల్లే తన ఫ్యాక్టరీ చిక్కుల్లో పడిందని తెలుసుకుని.. ఆమెను దారిలో పెట్టడానికి ప్రయత్నిస్తాడు. కానీ దివ్య అతణ్ని అసహ్యించుకుంటుంది. ఇంతలోనే దివ్యను కొందరు రౌడీలు కిడ్నాప్‌ చేయబోతే.. అడ్డుపడి వాళ్లకు బుద్ధి చెబుతాడు కార్తీక్‌. ఆ సమయంలోనే కార్తీక్‌ దివ్య కోసమే ఇండియాకు వచ్చాడని.. దీని వెనుకు పెద్ద ప్లాన్‌ ఉందని తెలుస్తుంది. ఇంతకీ ఆ ప్లాన్‌ ఏంటి? దివ్యకు, అతడికి సంబంధమేంటి.. అన్నది తెరమీదే చూడాలి.

కథనం, విశ్లేషణ:

        టాలీవుడ్‌లో ఏ హీరో స్లంప్‌లో ఉన్నా.. వెంటనే వాళ్ల కోసం ఓ సక్సెస్‌ ఫార్మాట్‌ 'రెడీ'గా ఉంటుంది. ఫస్టాఫ్‌లో ఓ సరదా ప్రేమకథ. సెకండాఫ్‌కు వచ్చేసరికి హీరో జగన్నాటక సూత్రధారిలా మారిపోయి.. అంతా తానే నడిపిస్తూ విడిపోయిన రెండు కుటుంబాల్ని కలిపే కథ. ఇదీ ఆ ఫార్మాట్‌. తాను హీరోగా నటించిన 'రెడీ' ఫార్మాట్లో సంవత్సరానికి పది సినిమాలు వస్తున్నాయని రామ్‌ స్వయంగా అన్నాడు. దీన్ని బట్టే తీసిన సినిమా తీయడంలో తప్పేమీ లేదని.. తనకు కూడా మరో ఆప్షన్‌ లేదని చెప్పకనే చెప్పాడు రామ్‌.

        ఐతే ఈ టైపు ఫార్మాట్‌ సినిమాలు కూడా ఎప్పుడూ ఒకేలా ఉండవు, ఒకే ఫలితాన్నీ ఇవ్వవు. కొన్ని.. ఇంకా ఎన్నాళ్లు ఇలాంటి సినిమాలు తీస్తారని మొహం మొత్తేలా ఉంటాయి. ఇంకొన్ని.. రొటీనే అయినా ఈమాత్రం వినోదాన్నిచ్చారు చాల్లే అని కొంచెం సంతృప్తినిచ్చేవీ ఉంటాయి. పండగ చేస్కో ఈ రెండు కేటగిరీలకు మధ్యలో ఉందని చెప్పాలి. సీన్‌కో సినిమాను గుర్తుకుతెస్తూ ఇబ్బంది పెట్టినా.. మినిమం గ్యారెంటీ వినోదంతో ఆ ఇబ్బందికి మందేస్తూ సాగుతుంది కథనం. ట్రైలర్‌ చూసినప్పుడే ఇది పైన చెప్పుకున్న 'ఫార్ములా' ప్రకారం సాగే సినిమా అని ఓ అంచనా వచ్చేసి ఉంటుంది. అయినా సినిమాకు తయారయ్యారంటే ఓకే. కాసిన్ని నవ్వులతో కాలక్షేపం చేయొచ్చు. అంతకుమించి ఏదైనా కొత్తదనం ఆశించి వస్తే మాత్రం నిరాశచెందక తప్పదు.

        మొదట్లో వచ్చే ఫారిన్‌ ఎపిసోడ్‌ విసిగించినా.. ఇండియాకు షిఫ్ట్‌ అయ్యాక కథనం కొంచెం వేగం అందుకుంటుంది. వెన్నెల కిషోర్‌, ఎమ్మెస్‌ నారాయణల కామెడీ  ట్రాక్‌ బండిని ఇంటర్వెల్‌ వరకు లాక్కెళ్తుంది. ప్రథమార్ధంలో ఇంతకుమించి చెప్పుకోవడానికేమీ లేదు. ఇంటర్వెల్‌ ముందు ఎప్పట్లాగే ఓ ట్విస్టు. ఇక రెండో అర్ధభాగానికి వస్తే ఓ పది హిట్టు సినిమాల్ని కలిపి కొట్టేశారు. ఓ పాతికమందిని ఒకచోటికి చేర్చి.. అందరినీ కన్ఫ్యూజన్‌లో పెట్టేసి.. గేమ్‌ నడిపించేస్తాడు హీరో.

        ఈ రొటీన్‌ గేమ్‌లోనూ వినోదానికి, సెంటిమెంటుకు ఢోకా లేకుండా చూసుకోవడం 'పండగ చేస్కో'కున్న ప్లస్‌ పాయింట్‌.    బ్రహ్మానందం మరీ రెచ్చిపోలేదు కానీ.. నవ్వించాడు. హీరోయిన్‌ చెంపదెబ్బను ముద్దులా ఫీలయ్యే సీన్లు బాగున్నాయి. పాత పంచ్‌ డైలాగులకు పేరడీలు ఓకే. చివర్లో సల్మాన్‌ 'కిక్‌' స్టయిల్లో ట్రాక్‌ దాటే సీన్‌కు కేకలే. చివర్లో పృథ్వీ, షకలక శంకర్‌ కొసమెరుపులా వచ్చి నవ్వించారు. వీళ్లిద్దరితో చేయించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' స్పూఫ్‌ బాగుంది. ఈ క్యారెక్టర్లను ఇంకొంచెం పొడిగించి ఉంటే బావుండేదేమో. క్లైమాక్స్‌ రొటీనే. 'అత్తారింటికి దారేది' క్లైమాక్స్‌ను డిట్టో దించేశారు. రామ్‌ కూడా పవన్‌ స్టయిల్లోనే డైలాగులు చెప్పాడు.

        సినిమాలో కమర్షియల్‌ హంగులేమీ తగ్గకుండా చూసుకున్నాడు గోపీచంద్‌. కామెడీ, సెంటిమెంట్‌, యాక్షన్‌.. ఇలా అన్ని లెక్కలూ వేసుకున్నాడు. బోలెడంతమంది ఆర్టిస్టులతో తెర కళకళలాడిపోయేలా చూశాడు. విలన్లు పెట్టాలంటే పెట్టాడు కానీ.. వాళ్లకేమీ ప్రాధాన్యమేమీ లేదు. హీరోయిన్లలో రకుల్‌ను అందంగా చూపించి.. సోనాల్‌ను ఎక్స్‌పోజింగ్‌కు ఉపయోగించుకున్నాడు. ఎమ్మెస్‌ నారాయణ క్యారెక్టర్‌తో డబుల్‌ మీనింగ్‌ బూతు జోకులు శ్రుతి మించాయి. బహుశా టైటిల్‌ కార్డ్స్‌లో గోపీచంద్‌.. మారుతికి థ్యాంక్స్‌ చెప్పడాన్ని బట్టి ఇది ఆయన పుణ్యమే అయి ఉండొచ్చేమో.

నటీనటులు:

         వరుస ఫ్లాపుల్లో ఉన్నా రామ్‌లో కాన్ఫిడెన్స్‌ తగ్గలేదు. ఎప్పట్లాగే చలాకీగా నటించాడు. ఐతే అతడి పాత్ర కానీ, నటన కానీ ఏమాత్రం కొత్తగా అనిపించదు. ఒక్క క్లైమాక్స్‌లో మాత్రమే కొంచెం భిన్నంగా ఎమోషన్‌ పండించడానికి ట్రై చేశాడు. కానీ అది పవన్‌ అనుకరణలో కొట్టుకుపోయింది. రామ్‌ డ్యాన్సుల గురించి చెప్పాల్సిన పనిలేదు. సింపుల్‌గా అదరగొట్టాడు. లుక్‌ చాలా స్టయిలిష్‌గా ఉంది. గత సినిమాల కంటే చాలా అందంగా కనిపించాడు. రకుల్‌ ప్రీత్‌, సోనాల్‌ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. గ్లామర్‌ విషయంలో సోనాల్‌ మార్కులు కొట్టేసింది. బూమ్‌ బూమ్‌ పాటలో ఆమె ఓ రేంజిలో రెచ్చిపోయింది. తాను ముంబయి భామనని గుర్తు చేసింది. పవిత్ర లోకేష్‌ సెంటిమెంటు బాగా పండించింది. సాయికుమార్‌, సంపత్‌ కూడా పాత్రలకు తగ్గట్లు బాగానే నటించారు. వెన్నెల కిషోర్‌, బ్రహ్మానందం, పృథ్వీ, షకలక శంకర్‌, ఎమ్మెస్‌ ఉన్నంతలో బాగానే నవ్వించారు..

సాంకేతిక వర్గం:

        తమన్‌ పాటల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు. ఎప్పట్లాగే వారుంచాడు. గుర్తుంచుకోదగ్గ పాటలేమీ లేవు. నేపథ్య సంగీతం కూడా రొటీన్‌గానే ఉంది. సమీర్‌ రెడ్డి ఛాయాగ్రహణం బాగుంది. సినిమాను ప్లెజెంట్‌గా ప్రెజెంట్‌ చేశాడు. వెలిగొండ శ్రీనివాస్‌ కథలో కొత్తదనం లేదు. కోన వెంకట్‌ మాటల్లో ఆయన మార్కు పంచ్‌లు అక్కడక్కడా పేలాయి. బ్రహ్మీ చెప్పే ''నమ్మకాని అమ్మ లాంటి వాణ్ని''.. వెన్నెల కిషోర్‌ తన గర్ల్‌ ఫ్రెండ్‌ గురించి చెప్పే.. ''అది క్యారమ్‌ బోర్డ్‌లో కాయిన్‌ లాంటిది. ఎవరేసినా పడిపోతుంది''.. ఇలాంటి కొన్ని డైలాగులు బాగున్నాయి. గోపీచంద్‌ మలినేని ఉన్న లిమిటేషన్స్‌లో సినిమాను నీట్‌గా తీశాడు కానీ.. ఏమాత్రం కొత్తదనం కోసం ప్రయత్నించకపోవడం నిరాశ కలిగిస్తుంది. అతను ఇంతకుముందు తీసిన మూడు సినిమాలతో పోలిస్తే.. ఈసారి తనను తాను ఓ ఛట్రంలో బిగించేసుకున్నాడనిపిస్తుంది. వినోదం ఉంటే చాలు ప్రేక్షకులు చూస్తారు కదా లాజిక్‌ లేకున్నా అనుకుని అటు తిప్పి ఇటు తిప్పి అదే కథను కాస్త కామెడీ, కొన్ని మాటలు వేసి రాసుకుంటూ పోతే... జనం చూస్తూ పోవడానికి వెర్రివెంగళప్పలు కాదు, కేవలం పెద్ద మనసుతో క్షమిస్తూ వస్తున్నారంతే.. వారికీ కోపం వచ్చే రోజు వస్తుంది. అది కూడా త్వరలో

చివరిగా...

        'పండగచేస్కో'లో ఓ సన్నివేశంలో హీరోయిన్‌ అంటుంది.. ''ఈ గేమ్‌లు నాకస్సలు నచ్చట్లేదు'' అని. దానికి హీరో సమాధానం.. ''అసలు గేమ్‌ ఆడుకుంటే గెలుపెక్కడ''. ఇలాంటి గేమ్స్‌ ఎన్ని సినిమాల్లో చూడలేదని ఎవరైనా అంటే.. సక్సెస్‌ కొట్టడానికి వేరే మార్గం లేదని ఈ డైలాగ్‌ ద్వారా చెప్పకనే చెప్పాడు దర్శకుడు. మరి గోపీచంద్‌ టీమ్‌ ఆడిన ఈ 'ఫార్ములా' ఎంటర్టైన్మెంట్‌ గేమ్‌ను ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో చూడాలి.

Tags:    

Similar News