అమ్మ కు వ్యతిరేకంగా 'తమ్ముడు' దీక్ష

Update: 2015-09-21 05:25 GMT
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఏపీ విపక్ష నేత జగన్ లా దీక్షల మార్గం ఎంచుకుంటున్నారు. దీంతో పవన్ కూడా మిగతా పొలిటీషియన్ లలా మారిపోతున్నారా అన్న అనుమానం కలుగుతోంది. రాజకీయ సమస్యల్లో చాలావరకు సంప్రదింపులు, చర్చలతో పరిష్కారమైపోతాయి... ముఖ్యంగా ఒక రాష్ట్రానికి ఇతర రాష్ట్రాలతో వచ్చే చిన్నపాటి సమస్యలకు చర్చలతో పరిష్కారం దొరుకుతుంది.అలాంటివాటికి కూడా ముందుగా ఆమాత్రం  ప్రయత్నం చేయకుండా ఏకంగా దీక్షలు, నిరసనలకు దిగడం హడావుడి చేయడమే తప్ప ఇంకేం కాదు.  తాజాగా తమిళనాడులో తెలుగు పరీక్ష ఎత్తివేయడంపై పవన్ కళ్యాణ్ దీక్షకు దిగుతానని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తమిళనాడులో నిర్బంధ తమిళ భాషా చట్టాన్ని అమలు చేస్తూ తెలుగును తొక్కిపెట్టడానికి వ్యతిరేకంగా ఆ రాష్ట్రానికి వెళ్లి దీక్ష చేయబోతున్నారు పవన్.  ఈ నెలాఖరులో ఆ దీక్ష ఉంటుంది. ఇందుకోసం పవన్ అభిమానులు ఇప్పటికే ఏర్పాట్లలో మునిగిపోయారు.

అయితే... పవన్ కు ఉన్న పరిచయాలు... ఆయన ఉన్న రంగం దృష్ట్యా  ఆయన దీక్ష చేయడం కంటే తమిళనాడుతో సంప్రదింపులు చేస్తేనే మంచిదన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రధాని నరేంద్రమోడీనే ఎప్పుడుకావాలంటే అప్పుడు కలవగలుగుతున్నారు పవన్. అలాంటి పవన్ కు తమిళనాడు సీఎం జయలలిత అపాయింట్ మెంటు దొరకడం కష్టమేమీ కాదు. ఆమెను కలిసి ఈ సమస్యపై చర్చించి పరిష్కారం దొరక్కపోతే దీక్షల వరకు వెళ్లినా అర్థముంటుంది. తమిళనాడులో ఉన్న మహామహా రాజకీయ పార్టీల నిరసనలు - ఆందోళనలు - దీక్షలకే ఏమాత్రం చలించని జయ ఇప్పుడు పవన్ దీక్షలకు స్పందిస్తారనుకుంటే అది అత్యాశే. కాబట్టి ఆ మార్గం కాకుండా పవన్ నేరుగా జయను కలిసి మాట్లాడితే ఫలితం ఉండొచ్చని అంటున్నారు.  అంతేకానీ ఇలా దీక్షలు చేయడం వల్ల లాభం లేదంటున్నారు. ఇది చిత్తశుద్ధి కాదని, ప్రచార బుద్ది ని సెటైర్లు వేస్తున్నారు.
Tags:    

Similar News