ఆ డైరెక్టర్‌ ఇంకో ఏడాది ఎదురు చూడాల్సిందే

Update: 2015-07-05 13:30 GMT
తొలి సినిమా సూపర్‌ హిట్‌ అయ్యిందంటే ఆ డైరెక్టర్‌ పంట పండినట్లే. సినిమా రిలీజైన మరుసటి రోజే నిర్మాతలు క్యూలో నిల్చుంటారు. స్క్రిప్టు రెడీగా ఉండాలే కానీ.. వెంటనే సినిమా చేసేయొచ్చు. 'రన్‌ రాజా రన్‌' ఫేమ్‌ సుజీత్‌కు కూడా ఇలాంటి ఆఫర్లు చాలానే వచ్చాయి. ఐతే తన తొలి సినిమా నిర్మాతలకే రెండో సినిమా కూడా చేయాలనుకున్నాడు. ప్రభాస్‌ హీరో అని ఫిక్సయ్యాడు. అలా ఫిక్స్‌ అయిపోయి ఏడాదిగా ఎదురు చూస్తున్నాడు కానీ.. తన హీరో ఖాళీ అవ్వట్లేదు. బాహుబలి ఫస్ట్‌ పార్ట్‌ షూటింగ్‌ నాలుగు నెలల ముందే పూర్తయిపోవడంతో రెండో పార్ట్‌ మొదలవ్వడానికి ముందు వచ్చే కొన్ని నెలల గ్యాప్‌లో సుజీత్‌ సినిమా పూర్తి చేసేస్తాడని అంతా అనుకున్నారు.

ప్రభాస్‌ కూడా ఆ మధ్య జుట్టు కత్తిరించుకుని అవతారం మార్చుకోవడంతో ఇక సుజీత్‌ సినిమా మొదలవ్వడమే ఆలస్యం అనుకున్నారు. కానీ ఆ సినిమా ఇంతవరకు సెట్స్‌ పైకి వెళ్లలేదు. అసలు ఈ ఏడాదంతా కూడా ఆ సినిమా మొదలయ్యే అవకాశమే లేదని ప్రభాస్‌ మాటల్ని బట్టి తెలుస్తోంది. ''సెప్టెంబరులో బాహుబలి రెండో పార్ట్‌ షూటింగ్‌ మొదలవుతుంది. రెండు నెలల ముందే దాని కోసం వర్కవుట్స్‌ మొదలుపెట్టాలి. సుజీత్‌తో సినిమా ఎప్పుడుంటుందో చెప్పలేను'' అనేశాడు ప్రభాస్‌. అంటే బాహుబలి రెండో పార్ట్‌ కూడా అయిపోయాకే సుజీత్‌ సినిమా మొదలుపెడతాడన్నమాట ప్రభాస్‌. ప్రస్తుతం ఉన్న మూడ్‌లోనే బాహుబలి-2 కూడా పూర్తి చేసేయాలని.. ఆ తర్వాతే ప్రశాంతంగా వేరే సినిమా చేసుకోవచ్చని.. అలా కాకుండా సుజీత్‌ సినిమా కోసం బాడీ లాంగ్వేజ్‌తో పాటు అన్నీ మార్చుకుంటే.. మళ్లీ బాహుబలి-2 చేయడానికి ఇబ్బందులొస్తాయని ప్రభాస్‌ భావిస్తున్నట్లుంది. కాబట్టి సుజీత్‌ ప్రభాస్‌ కోసం ఇంకో ఏడాది ఎదురు చూడాల్సిందే. ఈ మధ్యలో ఇంకేదైనా స్క్రిప్టు ఉంటే వేరే హీరోతో సినిమా ప్లాన్‌ చేయొచ్చు.

Tags:    

Similar News