రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను తెరకెక్కించడంలో అంతగా ప్రాబ్లమ్ ఏమి ఉండదు. కాకపోతే చారిత్రాత్మక కథలను ఎంచుకున్నప్పుడు సవాళ్లను ఎదుర్కోక తప్పదు. ముందుగా సమస్యలు వస్తాయని తెలిసినా కూడా కొంత మంది ధైర్యంగా సినిమాలను తీస్తారు. అయితే రీసెంట్ గా బాలీవుడ్ లో చాలా రోజుల తర్వాత ఒక సినిమాకు అనుకోని చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఆ సినిమా మరేదో కాదు. సంజయ్ లీల బన్సాలి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న పద్మావతి సినిమా.
రాజ్ పుత్ మహారాణి పద్మిని చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకునే టైటిల్ రోల్ లో కనిపిస్తుండగా.. రణ్వీర్ సింగ్ - షాహిద్ కపూర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాపై ప్రస్తుతం అనేక వివాదాలు చెలరేగుతున్నాయి. సినిమాని తప్పుగా తీస్తున్నారని గతంలో సెట్స్ మీద
కర్ణసేన కార్యకర్తలు దాడులు చేశారు. డైరెక్టర్ ను కొట్టారు. సెట్స్ కి నిప్పు కూడా అంటించారు. విడుదలను అడ్డుకుంటాని చెప్పారు. ఒక సినిమాను చూడకుండా షూటింగ్ దశలో ఉండగానే ఇలా చేస్తారా అని డైరెక్టర్ చాలా సీరియస్ కూడా అయ్యాడు.
అయితే ప్రస్తుతం కూడా కొన్ని వివాదాలు చెలరేగుతుండడంతో పద్మావతి సినిమా యూనిట్ కి ప్రకాశ్ రాజ్ మద్దతుగా నిలిచాడు. జస్ట్ ఆస్కింగ్ అంటూ.. సోషల్ మీడియాలో తనదైన శైలిలో స్పందించాడు. ‘ఒకరి సొంత వూహాగానాల వల్ల మీకు సినిమా సెట్ పై దాడి చేసి - దర్శకుడిని కొట్టే స్వేచ్ఛ ఉంటుంది. సెట్స్ కి నిప్పు పెట్టె స్వేచ్ఛ ఉంటుంది. ఇక చిత్రాన్ని సెన్సార్ చేయడానికి కూడా మీకు మీరే ఓ కమిటీని ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ ఉంటుంది. అలాగే సినిమా విడుదలకు ముందు సినిమాని ఆపేసే స్వేచ్ఛ కూడా ఉంటుంది. ఈ తరహా కార్యక్రమాలను ఏమంటారు?' అని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించాడు. అంతే కాకుండా ఈ దాడులకు అసలైన సూత్రదారులు ఎవరూ అంటూ పెదవి విరిచాడు కూడా!!