బాహుబ‌లిని.. బాహుబ‌లే కొట్ట‌గ‌ల‌డంతే

Update: 2015-07-12 04:16 GMT
ఆ వుడ్డు.. ఈ వుడ్డు అన్న తేడా లేకుండా.. భార‌త‌దేశ సినిమా ప‌రిశ్ర‌మ మొత్తం ఇప్పుడు మాట్లాడుకుంటుంది.. బాహుబ‌లి సినిమా గురించే. ఈ సినిమాకు సంబంధించి ఆకాశానికి ఎత్తేసే వారున్న‌ట్లే.. అడ్డంగా తిట్టిపారేసేటోళ్లు ఉన్నారు. ఎవ‌రు ఎన్ని మాట‌లు అన్నా.. రివ్యూలు రాసిన వారంతా తేల్చిన విష‌యాన్ని ఒక్క‌మాట‌లో చెప్పాలంటే.. అద్భుతం.. మ‌హాఅద్భుతం కాకున్నా.. సినిమా బాగుందనే.

సినిమాకు హైప్ క్రియేట్ చేసి.. ప్రేక్ష‌కుడి సంతృప్తి పాళ్లు త‌గ్గించార‌న్న ఫిర్యాదు ఉన్న‌ప్ప‌టికీ.. ఆ హైపే లేక‌పోతే.. క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిసేది కాద‌న్న‌ది నిజం. సినిమా బాగుందా? బాగా లేదా? అన్న విష‌యాల్ని కాసేపు ప‌క్క‌న పెడితే.. క‌లెక్ష‌న్ల విష‌యంలో మాత్రం రికార్డుల్ని బ‌ద్ధ‌లు కొట్టేస్తోంది.  తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో ఎవ‌రూ అందులోలేనంత భారీగా రికార్డుల్ని నెల‌కొల్పింది.

ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న రికార్డులు మొత్తం మాట‌ష్ అయ్యే ప‌రిస్థితి. ఈ క‌లెక్ష‌న్ల వ‌ర్షం కొన‌సాగే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో.. తాజాగా మ‌రో చ‌ర్చ మొద‌లైంది. బాహుబ‌లి వ‌చ్చింది.. క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తోంది ఓకే. మ‌రి.. ఈ రికార్డు క‌లెక్ష‌న్ల‌ను బ‌ద్ధ‌లు కొట్టే మొన‌గాడు ఎవ‌రు? అన్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

దీంతో.. వెండితెర వేల్పులు ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. మ‌హేశ్‌బాబు.. జూనియ‌ర్ ఎన్టీఆర్ లాంటి పేర్ల‌ను తెర మీద‌కు తీసుకొస్తున్నారు. బాహుబ‌లి ముందు వ‌ర‌కూ.. మొద‌టి రోజు అత్య‌ధిక క‌లెక్ష‌న్లు వ‌సూలు చేసిన చిత్రంగా ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. అత్తారింటికి దారేది మాత్ర‌మే ఉంది. ఈ చిత్రం మొద‌టి రోజు రూ.10.8కోట్ల క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టింది.
తాజా సంచ‌ల‌నం బాహుబ‌లి మొద‌టి రోజు ఓవ‌ర్‌సీస్ క‌లుపుకుంటే రూ.30కోట్లు ట‌చ్ అయ్యింది. మ‌రి.. ఇంత భారీ మొత్తం ఎవ‌రికి సినిమాకు ఉంద‌న్న విష‌యం మీద కాస్తంత ఫ్రాంక్‌గా మాట్లాడుకుంటే.. మ‌రెవ‌రికీ లేద‌నే చెప్పాలి. దీనికి కార‌ణాలు లేక‌పోలేదు. బాహుబ‌లి సినిమా విడుద‌ల‌ను చూస్తే.. ఒక్క గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోనే అర‌డ‌జ‌ను హాళ్ల మిన‌హా మిగిలిన స్ర్కీన్లు మొత్తం బాహుబ‌లితో నిండిపోయాయి.

భార‌త సినీ చ‌రిత్ర‌కే గ‌ర్వ‌కార‌ణం అంటూ చేసిన భారీ ప్ర‌చారంతో పాటు.. రూ.100కోట్లు పెట్టిన సినిమాను దెబ్బ తీస్తే.. చిత్ర ప‌రిశ్ర‌మ మొత్తం ప్ర‌భావానికి గురి అవుతుంద‌న్న జాలి మాట‌లు కానీ.. మ‌రోలాంటి మాట‌ల‌తో ఉన్న స్ర్కీన్లు బాహుబ‌లికి కేటాయించారు.

ప‌లువురు పెద్ద హీరోలు సైతం.. స‌ర్లే అంటూ వెన‌క్కి త‌గ్గి త‌మ సినిమా విడుద‌ల‌ను రెండు వారాల పాటు వాయిదా వేసుకున్న ప‌రిస్థితి. ఇలాంటి ప్ర‌త్యేక ప‌రిస్థితి ప్ర‌తిసారీ వ‌చ్చే ఛాన్సే లేదు. మ‌ళ్లీ వ‌స్తే.. గిస్తే.. బాహుబ‌లి ద ఎండింగ్ కే సాధ్యం కావాలి. సినిమాలు అంద‌రూ తీస్తారు. కానీ.. త‌న సినిమాకు ఎంత బ‌డ్జెట్ పెడ‌తారో కాస్త అటూఇటూగా అందులో సగం మేర బ‌డ్జెట్ అంత మీడియా ప్ర‌చారాన్ని చేయించుకునే స‌త్తా ఒక్క రాజ‌మౌళికి మాత్ర‌మే ఉంది. మ‌రి అలాంట‌ప్పుడు.. మొద‌టిరోజు రూ.30కోట్ల క‌లెక్ష‌న్ బాహుబ‌లి ద ఎండింగ్ (అంటే పార్ట్ 2 అన్న మాట‌) కి మాత్ర‌మే ఛాన్స్ ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. అదెంత వ‌ర‌కు నిజం అన్న‌ది కాల‌మే చెప్పాలి
Tags:    

Similar News