అంత చేసినా.. మిలియన్ క్లబ్ అడియాసే

Update: 2015-10-20 10:53 GMT
మిలియన్ క్లబ్బేం కర్మ.. ఈసారి డబుల్ మిలియన్ క్లబ్ గ్యారెంటీ అనుకున్నారు బ్రూస్ లీ సినిమా విషయంలో నెలకొన్న హంగామా చూసి. కానీ తీరా చూస్తే ఎంత భారీగా సినిమాను విడుదల చేసినా రామ్ చరణ్ కు మళ్లీ ‘మిలియన్ క్లబ్’ ఆశ అడియాసగానే మిగిలే పరిస్థితి కనిపిస్తోంది. నాని లాంటి చిన్న హీరో కూడా ‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో అనూహ్యంగా దాదాపు ఒకటిన్నర మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించాడు అమెరికాలో. ఆ సినిమా వంద స్క్రీన్లలో విడుదలైంది. ఐతే ‘బ్రూస్ లీ’ సినిమాను ఏకంగా 220 స్క్రీన్లలో విడుదల చేశారు. ఇంతకుమందు టాలీవుడ్ నుంచి బాహుబలి, శ్రీమంతుడు సినిమాలు మాత్రమే యుఎస్ లో 200కు పైగా స్క్రీన్లలో విడుదలయ్యాయి. ఐతే దానికి తగ్గట్లే ఆ సినిమాలు వసూళ్లు కూడా సాధించాయి.

కానీ బ్రూస్ లీ అంచనాల్ని అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది. ఫస్ట్ వీకెండ్ లో ఈ సినిమా 6 లక్షల డాలర్లు మాత్రమే వసూలు చేసింది. వీకెండ్ తర్వాత వసూళ్లు దారుణంగా పడిపోవడంతో ఈ సినిమా కూడా చరణ్ మిలియన్ క్లబ్ ఆశ తీర్చడం కష్టమేనని తేలిపోయింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. శ్రీను వైట్లకు యుఎస్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. దూకుడు దగ్గర్నుంచి అతడి ప్రతి సినిమా మిలియన్ క్లబ్బులో చేరుతోంది. అట్టర్ ఫ్లాప్ సినిమా ‘ఆగడు’ కూడా అక్కడ మిలియన్ క్లబ్బులో అడుగుపెట్టింది. పైగా మెగాస్టార్ క్యామియో కూడా ఉండటంతో ఈసారి చరణ్ కనీసం రెండు మిలియన్ డాలర్లు వసూలు చేస్తాడనుకున్నారు. కానీ మిలియన్ డాలర్లే కష్టంగా ఉంది.
Tags:    

Similar News