అంత ఇష్టమైన పాటను అందుకే డిలీట్ చేశారా..?

Update: 2022-03-03 01:30 GMT
పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి కలిసి నటించిన 'భీమ్లా నాయక్' చిత్రం ఇటీవలే విడుదలై భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. వీకెండ్ తర్వాత కలెక్షన్స్ డ్రాప్ అవ్వకుండా.. జనాల దృష్టిని ఆకర్షించడానికి మేకర్స్ డిలీట్ చేసిన కంటెంట్ ను కలుపుతారని టాక్ వచ్చింది. ముఖ్యంగా 'అంత ఇష్టం' అనే సాంగ్ ను యాడ్ చేస్తారని అందరూ అనుకున్నారు.

అంత ఇష్టం ఏంద‌య్యా' అనే లిరికల్ వీడియోకి ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చిందనే సంగతి తెలిసిందే. థమన్ స్వరపరిచిన ఈ పాట యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. పవన్ కళ్యాణ్ - హీరోయిన్ నిత్యా మీనన్ ల మధ్య సాగిన ఈ మెలోడీని సినిమా నుంచి తొలగించారు.

'భీమ్లా నాయక్' సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తున్నప్పటికీ.. చార్ట్ బస్టర్ గా నిలిచిన 'అంత ఇష్టం' సాంగ్ లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. అంత మంచి పాటను ఎందుకు తొలగించారా అని అందరూ ఆలోచించారు.

ఈ సినిమా నిడివి కూడా ఏమంత ఎక్కువ లేదు కాబట్టి.. రెండో వారంలో ఆ పాటను సినిమాలో జత చేయాలని మేకర్స్ ను రిక్వెస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు. అయితే ఈ సాంగ్ పెట్టడానికి సరైన సందర్భం లేకపోవడం వల్లనే తొలగించినట్లు చిత్ర బృందం చెబుతోంది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో 'అంత ఇష్టం' పాటను తొలగించడం గురించి థమన్ వద్ద ప్రస్తావించగా.. 'మండుతున్న స్టౌవ్ పై నీళ్లు పోస్తే ఎలా ఉంటుంది?' అంటూ ఎదురు ప్ర‌శ్న వేశారు. దీనిని బట్టి మాస్ యాక్ష‌న్ ఫ్లోలో సినిమా సాగుతున్న స‌మ‌యంలో అలాంటి మెలోడీని పెట్టడం క‌రెక్ట్ కాదని తొల‌గించిన‌ట్టు అర్థం అవుతోంది.

అయితే సాగర్ కె చంద్ర మాత్రం అసలు ఆ పాటను చిత్రీకరించలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. కేవలం అంత ఇష్టం పాటను రికార్డు మాత్రమే చేశామని.. షూట్ చేయలేదని డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు. ఈ కథకు అది వర్కౌట్ కాదని షూటింగ్ చేయలేదని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

దీనిని బట్టి 'అంత ఇష్టం' మెలోడీ 'భీమ్లా నాయక్' సినిమాలో ఉండే అవకాశం లేదని తేలిపోయింది. అయితే మేకర్స్ నిర్ణయం వల్ల హీరోయిన్ నిత్యా మీనన్ నిరాశ చెందిందని.. కోర్ టీమ్ లో ఒకరితో ఈ విషయంలో గొడవ పడిందని పుకార్లు వినిపిస్తున్నాయి. అందుకే ప్రమోషనల్ ప్రోగ్రామ్‌ లలో మరియు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ లో నిత్యా హాజరు కాలేదని అంటున్నారు.

ఇటీవల భీమ్లా మూవీ థ్యాంక్యూ మీట్‌ లో కూడా నిత్యా కనిపించలేదు. ప్రీ-రిలీజ్ ఈవెంట్ సమయంలో నిత్యామీనన్ హైదరాబాద్‌ లోనే ఉందని.. అయినా ఫంక్షన్ కు రాలేదని టాక్స్ ఉన్నాయి. కారణం ఏదైనా 'అంత ఇష్టం' పాటను సినిమాలో జత చేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

కాగా, 'భీమ్లా నాయక్' చిత్రాన్ని సాగర్ కె చంద్ర తెరకెక్కించగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందించారు. ఇది అయ్యప్పనుమ్ కోసియుమ్ చిత్రానికి రీమేక్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.
Tags:    

Similar News