చివరికి సాయి పల్లవి అలా అయింది

Update: 2017-12-24 04:36 GMT
సాయిపల్లవి తొలి సినిమా ‘ప్రేమమ్’ ఆమెకు ఎంత గొప్ప పేరు తెచ్చిపెట్టిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆ తర్వాత మలయాళంలోనే చేసిన ‘కాళి’లోనూ ఆమె తన నటనతో కట్టిపడేసింది. ఇక తెలుగులో సాయిపల్లవి అరంగేట్ర సినిమా ‘ఫిదా’ మన ప్రేక్షకుల్ని ఎలా ఉర్రూతలూగించిందో తెలిసిందే. ఆ చిత్రం అంత పెద్ద హిట్టయిందంటే అందుకు ప్రధాన కారణం సాయిపల్లవే అనడంలో సందేహం లేదు.

‘ఫిదా’ తర్వాత సాయిపల్లవి నటించిన తర్వాతి సినిమా మీద ప్రేక్షకులు ఎంతో అంచనాలతో ఉన్నారు. అందులోనూ నాని లాంటి గ్రేట్ పెర్ఫామర్ తో సాయిపల్లవి సినిమా అనగానే ఇద్దరూ పోటాపోటీగా నటించి ఉంటారని.. ఎవరు ఎవరిని డామినేట్ చేస్తారో.. ఆమె పాత్రను ఎలా తీర్చిదిద్దారో చూడాలని ఆసక్తితో ఉన్నారు ప్రేక్షకులు. కానీ ‘ఎంసీఏ’ అలాంటి ప్రేక్షకుల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ సినిమాలో సాయిపల్లవిది నామమాత్రమైన పాత్ర.

కనీసం ప్రథమార్ధంలో సాయిపల్లవికి అంతో ఇంతో రోల్ ఉంది కానీ.. ద్వితీయార్ధంలో ఆమె పాత్రకు ఏమాత్రం స్కోప్ ఇవ్వలేదు. ఈ సినిమాలో సాయిపల్లవి నటిగా పెద్దగా చేసిందేమీ లేదు. కేవలం డ్యాన్సుల వరకు ఆమెను బాగా వాడుకున్నారు. స్వతహాగా మంచి డ్యాన్సర్ అయిన సాయిపల్లవి.. ఫ్యామిలీ పార్టీ.. ఏవండోయ్ నాని గారూ పాటల్లో డ్యాన్సులు అదరగొట్టేసింది.

కానీ సాయిపల్లవి నుంచి జనాలు ఆశించేది అది కాదు. ఆమె మార్కు నటన. అంత టాలెంటెడ్ నటిని సరిగ్గా ఉపయోగించుకోవడంలో దర్శకుడు వేణు శ్రీరామ్ విఫలమయ్యాడు. ఈమాత్రం దానికే సాయిపల్లవినే ఎందుకు తీసుకున్నట్లు.. ఎవరైనా రెగ్యులర్ హీరోయిన్ అయినా సరిపోయేది కదా అన్న అభిప్రాయాలు జనాల్లో వ్యక్తమవుతున్నాయి.
Tags:    

Similar News