సంక్రాంతి పోటీ: బంగారు బాతును కోస్తున్నారా?

Update: 2019-10-14 04:15 GMT
టాలీవుడ్ లో బిగ్గెస్ట్ సీజన్లలో సంక్రాంతి ఒకటి.  ఈ సీజన్ లో సాధారణమైన సినిమాలను రిలీజ్ చేసేందుకు ఛాన్స్ దొరకదు.  స్టార్ హీరోల సినిమాలు లేదా టాప్ ప్రొడ్యూసర్ల బ్యాకప్ ఉండే చిన్న సినిమాలకే అవకాశం ఉంటుంది.  అయితే ప్రతిసారి స్టార్ హీరోల సినిమాల పోటీ ఉంటుంది కానీ ఈసారి ఆ పోటీ మరీ తీవ్రంగా ఉంది. నిజానికి గతంలో సంక్రాంతి సినిమాల రిలీజులకు మధ్య ఒకటి రెండు రోజుల గ్యాప్ ఉండేది.  దీంతో ఒక సినిమాకు మరో సినిమాకు మధ్య పరోక్షమైన పోటీ ఉండేది కానీ ప్రత్యక్షమైన పోటీ కాదు. అయితే ఈ సారి మాత్రం మహేష్ సినిమా 'సరిలేరు నీకెవ్వరు'..  అల్లు అర్జున్ సినిమా 'అల వైకుంఠపురములో' రెండూ ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి.  ఇవి కాకుండా రజనీకాంత్ 'దర్బార్' రెండు రోజుల తర్వాత లైన్లో ఉంది. మరో సినిమా కూడా పోటీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది.

నిజానికి ప్రతిసారి పెద్ద సినిమాల నిర్మాతలు కూర్చొని మాట్లాడి సామరస్యపూర్వకంగా డేట్స్ ను ఫైనలైజ్ చేసుకునేవారు.  దీంతో థియేటర్ల విషయంలో సర్దుబాటుకు అవకాశం ఉండేది.  అయితే ఈ సారి మహేష్.. అల్లు అర్జున్ సినిమాలు రెండు పెద్దవే.  సోలో రిలీజ్ లేదా డిఫరెంట్ డేట్స్ లో రిలీజ్ అయితే ఒకరి సినిమా వల్ల  మరోకరి సినిమాకు కలెక్షన్స్ లో కోత పడే అవకాశం ఉండదు.  ఇప్పుడు మొదటి రోజు నుండే తీవ్రమైన పోటీలో రిలీజ్ కావడంతో ఒకరి సినిమా షేర్ ను మరొకరు తినేసే ప్రమాదం పొంచి ఉంది.  దీంతో ఎవరికీ భారీ ఓపెనింగ్ కలెక్షన్స్ దక్కవు.  పైగా కళ్యాణ్ రామ్ సినిమా కూడా పోటీలో ఉంది కాబట్టి  ఏ సినిమా అయినా తక్కువ థియేటర్లతో సర్దుకోవాల్సిందే.

నిజానికి ఇలాంటి పోటీ హీరోల ఈగో కారణంగానే వచ్చిందని ఇన్ సైడ్ టాక్.  కానీ దీనివల్ల నష్టపోయేది మాత్రం హీరోలు కాదు.  ఈ సినిమాను కొన్న బయ్యర్లు.. డిస్ట్రిబ్యూటర్లు.  ఎందుకంటే పెద్ద స్టార్ హీరోల సినిమాలకు లాభాలు నేతి బీరకాయలో నెయ్యి లాంటివి.  ఆ భారీ  కలెక్షన్స్ ఫిగర్లు ఫ్యాన్స్ మురిసిపోవడానికి తప్ప దేనికీ పనికిరావు.  బైటకు ప్రొజెక్ట్ చేసుకునే లాభాలు నిజంగా ఉండవు.  దీంతో ఇప్పటికే చాలామంది బయ్యర్లు ఈ వికృతమైన జూదం ఆడలేక ఫీల్డ్ నే వదిలేస్తున్నారు. ఇక ఓవర్సీస్ లో పెట్టుబడి లో సగం కూడా రావడం లేదు. గ్రాస్ కలెక్షన్స్ చూసి అవే మహాభాగ్యం అనుకునే దుస్థితి. నిజానికి టాక్సులు.. థియేటర్ల లీజులు అన్నీ ఆ గ్రాస్ నుంచి మైనస్ చేస్తే అక్కడ డిస్ట్రిబ్యూటర్లకు లాభాలే ఉండవు.  ఇలాంటి పరిస్థితుల్లో ఓకే రోజు ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయితే రెండు సినిమాల డిస్ట్రిబ్యూటర్లు నష్టపోవడం ఖాయమే.   

సంక్రాంతి రిలీజుల్లో విన్నర్ గా నిలిచిన సినిమాకు ఈ సూత్రాలన్నీ వర్తించవు కానీ యావరేజ్ సినిమాలు మాత్రం కుదేలవడం ఖాయం. ఇదంతా చూసుంటే సంక్రాంతి బాతు నుంచి బంగారు బాతు గుడ్డును తీసుకోకుండా బాతునే కోసుకునే తరహాలో హీరోలు వ్యవహరిస్తున్నారని ఇండస్ట్రీ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.


Tags:    

Similar News