కొన్ని గంటల వ్యవధిలో ముగ్గురికి సాయం.. నీవు దేవుడివి బాసూ

Update: 2020-07-27 10:10 GMT
గత రెండు నెలల కాలంగా సోషల్‌ మీడియాలో సోనూసూద్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. లాక్‌ డౌన్‌ కారణంగా వలస కార్మికులు పడుతున్న బాధను చూసి తట్టుకోలేక సోనూసూద్‌ వందల బస్సులు.. రైళ్లు.. ప్రత్యేక విమానం ఇలా ఎవరికి ఏది అవసరమో అది ఏర్పాటు చేసి వేలాది మందిని వారివారి స్వస్థలాలకు చేరడంలో సాయం చేశాడు. వలస కూలీలు స్వస్థలాలకు చేరిన తర్వాత తన పని అయ్యిందని చేతులు దులిపేసుకోలేదు. సాయం చేయడంలో వచ్చే కిక్‌ సోనూసూద్‌ కు నచ్చిందేమో కాని వరుసగా సాయాలు చేస్తూనే ఉన్నాడు.

తాజాగా కొన్ని గంటల వ్యవధిలో సోషల్‌ మీడియాలో వచ్చిన వీడియోలకు స్పందించి వారికి సాయం చేస్తానంటూ ప్రకటించాడు. 85 ఏళ్ల బామ్మ చేస్తున్న కర్ర సామును చూసి ఆ బామ్మకు ఒక స్కూల్‌ పెట్టిస్తానంటూ అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా మొదలు పెట్టాడు. ఇక ఒక స్టార్టప్‌ కంపెనీలో సాఫ్ట్‌ వేర్‌ జాబ్‌ చేస్తున్న శారద కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా ఉద్యోగం కోల్పోయింది. ఆమె తన తల్లి నిర్వహిస్తున్న కూరగాయల వ్యాపారం నిర్వహిస్తున్నట్లుగా ఒక మీడియా ఛానెల్‌ లో వచ్చింది. వెంటనే ఆమెకు కూడా సాయం చేశాడు. ఆమెకు మరో ఉద్యోగం వచ్చేప్పటి వరకు ఆర్థికంగా భరోసా కలిగించేందుకు ఆమె మరో ఉద్యోగంపై దృష్టి పెట్టేందుకు మద్దతుగా నిలుస్తానంటూ హామీ ఇచ్చాడు.

ఇక చివరగా చిత్తూరు జిల్లాకు చెందిన నాగేశ్వరరావు అనే రైతు తన ఇద్దరు కూతుర్లతో నాగలి లాగించడం చూసి చలించి పోయి వారికి ఎడ్లు సాయం చేస్తానంటూ ప్రకటించాడు. తన నిర్ణయాన్ని మార్చుకుని కేవలం మూడు గంటల్లో వారి ఇంటి వద్ద వారికి అవసరం అయిన ట్రాక్టర్‌ ఉంచాడు. ఈ మూడు కూడా కేవలం కొన్ని గంటల వ్యవధిలో చేశాడు. చేసిన సాయాలు చిన్నవా పెద్దవా అనే విషయాన్ని పక్కన పెడితే మూడు కుటుంబాలకు ఇప్పుడు ఆయన దేవుడు అయ్యాడు. అందుకే నెటిజన్స్‌ కూడా సోనూసూద్‌ ను మొన్నటి వరకు రియల్‌ హీరో అన్నారు ఇప్పుడు దేవుడు అంటున్నారు.
Tags:    

Similar News