తొలిసారి సుక్కు నిద్ర‌పోలేద‌ట‌!

Update: 2018-04-09 05:15 GMT
ఎంత పెద్ద సినిమా అయినా మొద‌టివారం ఇర‌గ‌దీసే క‌లెక్ష‌న్లు..రెండో వారం వ‌చ్చేస‌రికి కాస్తంత నెమ్మ‌దించ‌టం మామూలే. కానీ.. ఇందుకు భిన్నంగా ఉంది రంగ‌స్థ‌లం వ్య‌వ‌హారం. రిలీజ్ రోజు నుంచే పాజిటివ్ టాక్  మొద‌లైన ఈ మూవీకి రోజులు గ‌డుస్తున్న‌కొద్దీ క్రేజ్ అంత‌కంత‌కూ పెరుగుతోంది.

సెకండ్ వీక్ లోనూ క‌లెక్ష‌న్ల‌కు ఎలాంటి ఢోకా లేక‌పోవ‌ట‌మే కాదు.. మ‌రింత ఉత్సాహంగా ప‌రుగులు తీయ‌టం.. కొత్త రికార్డుల దిశ‌గా ప‌రుగులు పెడుతున్న వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఇక‌.. ఈ చిత్ర ద‌ర్శ‌కుడు సుకుమార్ కు అయితే ఈ సినిమా స‌క్సెస్ ఇచ్చిన ఆనందం అంతాఇంతా కాదు.

సాధార‌ణంగా తెలుగు సినిమాల్లో క‌నిపించ‌ని వైనానికి భిన్నంగా.. త‌మిళ సినిమాల్లో త‌ర‌చూ క‌నిపించే "రా" త‌ర‌హాలో సినిమాను తెర‌కెక్కించిన సుకుమార్ గ‌ట్స్ ను మెచ్చుకోవాల్సిందే. తెలుగు సినిమా రూపురేఖ‌ల్ని మార్చ‌టంతో పాటు.. స‌రైన రీతిలో సినిమాను తీస్తే స‌క్సెస్ కు ఢోకా లేద‌న్న విష‌యాన్ని తన తాజా మూవీతో నిరూపించాడు.

ఇప్ప‌టివ‌ర‌కూ తానెన్నో సినిమాలు చేసినా.. ఏ సినిమాకు లేని రీతిలో సుక్కు టెన్ష‌న్ అనుభ‌వించాడ‌ట‌. సినిమా రిజ‌ల్ట్ ఏమిట‌న్న విష‌యంపై ఎంతో ఉత్కంఠ‌కు లోనైన‌ట్లు చెప్పాడు. సినిమాను ముందు చిరంజీవి చూసి బాగుంద‌న‌టంతో.. స్నేహితులు కూడా పాజిటివ్ గా రెస్పాండ్ అయినా.. ఏదో తెలీని టెన్ష‌న్ సుక్కును వెంటాడింద‌ట‌.

తాను తీసిన ప్ర‌తి సినిమాకు చ‌క్క‌గా నిద్ర‌పోయి పొద్దున్నే రిజ‌ల్ట్ చూసుకునేవాడిన‌ని.. కానీ రంగ‌స్థ‌లం విష‌యంలో మాత్రం అలా జ‌ర‌గ‌లేద‌న్నాడు. ఈ సినిమా రిలీజ్ కు నిద్ర‌పోలేద‌ని.. యూఎస్ టాక్ కోసం వెయిట్ చేశాన‌ని.. బాగుంద‌న్న టాక్ వ‌చ్చినా టెన్ష‌న్ పోలేద‌న్నాడు. దీనికి కార‌ణం లేక‌పోలేదు. యూఎస్ లో హిట్ టాక్ వ‌చ్చిన కొన్ని సినిమాలు ఇక్క‌డ ఆడ‌లేద‌ని.. అందుకే మ‌న ద‌గ్గ‌ర టాక్ ఏమిటో తెలుసుకోవాల‌న్న టెన్ష‌న్ లో నిద్ర పోలేద‌న్నారు. మార్నింగ్ షో అయి.. సినిమా బాగుంద‌న్న టాక్ వ‌చ్చిన త‌ర్వాతే ప‌డుకున్న‌ట్లు చెప్పాడు.


Tags:    

Similar News