అప్పుడు వార్నింగ్.. ఇప్పుడు శభాష్.. ఎన్టీఆర్ -బండి కలయిక

Update: 2022-08-22 07:30 GMT
రాజకీయాల్లో అవసరాలే ఉంటాయి. తెలంగాణ కోసం గొంగళి పురుగును అయినా ముద్దాడుతాను అని కేసీఆర్ అన్నాడు.ఇప్పుడు తమ రాజకీయ ప్రయోజనాల కోసం అప్పుడు తిట్టిన నోటితోనే నేడు స్వాగతం పలుకుతానని బండి సంజయ్ అంటున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ ను తిట్టి హెచ్చరించిన నోటితోనే ఇప్పుడు స్వాగతం పలికాడు. ఆ ఫొటోలు షేర్ చేసి ఇప్పుడు నెటిజన్లు ఆడుకుంటున్నారు.. ట్రోల్ చేస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమా ట్రైలర్ విడుదల వేళ..మూవీ విడుదల వేళ ఇదే తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఎన్టీఆర్ మీద విరుచుకుపడ్డారు. రజాకర్లపై పోరాడిన గోండు బిడ్డ కొమురంభీంను ముస్లింగా చూపించిన వైనాన్ని ప్రశ్నించాడు. ఎన్టీఆర్ ముస్లిం గెటప్ లో కనిపిస్తే... చరిత్రను వక్రీకరిస్తున్నావ్.. బిడ్డా ఊరుకోం అంటూ హెచ్చరించాడు. ఎన్టీఆర్ పై ఎన్ని మాటలు అనాలో అన్నీ అనేశాడు బండిసంజయ్.

కట్ చేస్తే.. ఇప్పుడు అదే ఎన్టీఆర్ ను కేంద్రహోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఆహ్వానించి చర్చలు జరిపి భోజనం కూడా చేశారు. ఎన్టీఆర్ ను బీజేపీ నెత్తిన పెట్టుకుంది. అమిత్ షా పిలవడంతో వచ్చిన ఎన్టీఆర్ కు ఇదే బండి సంజయ్ గేటు వద్ద వంగి వంగి దండాలు పెట్టిన ఫొటోలు వైరల్ అయ్యాయి.

ఈ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన నెటిజన్లు బండి సంజయ్ ను కడిగిపారేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకు ముందు బండి సంజయ్ మూవీని అడ్డుకుంటామని హెచ్చరించారని పాత వీడియోను షేర్ చేస్తున్నారు.

కొమురంభీంకు రాజమౌళి ముస్లిం టోపీ పెట్టారని.. థియేటర్లు తగులబెడుతామని అప్పట్లో బండి వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు అదే బండి సంజయ్ ఏకంగా ఎన్టీఆర్ ను అభినందించడం రాజకీయాల కోసమా? అంటూ ధ్వజమెత్తుతున్నారు.

రాజకీయాల కోసం బీజేపీ నేతలు ఎంతకైనా దిగజారుతారా?అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా తారల గౌరవాన్ని కాపాడాలని.. ఇష్టానుసారంగా విద్వేషాల కోసం నోరు జారవద్దంటూ ‘బండి’కి హితవు పలుకుతున్నారు.
Tags:    

Similar News