ప్రపంచంలో మరెవరూ చేయలేని సాహసం తెలుగు ప్రజలు చేస్తున్నారట

Update: 2021-08-25 03:37 GMT
మాటలతో మేజిక్ చేయటం తెలిసిందే. అయితే.. ఎక్కడా పట్టు తప్పకుండా.. పక్కదారికి పోకుండా మాటలతో మంత్రించినట్లుగా సీట్లకు అతుక్కుపోయేలా.. చూసిన సినిమాను మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా తీయటంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలెంటే వేరని చెప్పాలి. చాలామంది దర్శకులకు భిన్నంగా తన సినిమాల్లో మహిళల పాత్రల్ని తీర్చి దిద్దే తీరు వేరుగా ఉంటుందన్న విషయం తెలిసిందే. చిన్నగా చెప్పే మాటలతో అంతులేని లోతు ఉండేలా ఆయన మాటలు ఉంటాయి.

అందుకే.. ఆయన మైకు పట్టుకున్న ప్రతిసారి తెలుగు ప్రేక్షకుడు చాలా జాగ్రత్తగా ఆయన మాటల్ని వింటుంటారు. తాజాగా ఆయన ‘ఇచట వాహనములు నిలుపరాదు’ సినిమాకు సంబంధించిన కార్యక్రమానికి హాజరయ్యారు. సుశాంత్ హీరోగా నటించిన ఈ సినిమా మీద అంచనాలు బాగున్నాయి. భిన్నమైన కాన్సెప్టుతో సినిమాను తీశారన్న మాట వినిపిస్తోంది.ఇదిలా ఉంటే.. తాజాగా తెలుగు ప్రేక్షకులు.. వారి సాహసం గురించి త్రివిక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తనకు తెలిసి ప్రపంచం మొత్తంలో థియేటర్స్ కు వచ్చేందుకు సాహసిస్తున్న జాతి.. తెలుగుజాతి మాత్రమేనని చెప్పారు. నిజమే.. తెలుగువారి జీవితాల్లో సినిమా ఒక భాగం. తొక్కలో కరోనా అయితే అయి ఉండొచ్చు. కానీ.. వెండి తెర మీద వెలిగిపోయే బొమ్మల్ని చూస్తే.. ఆనందపడే తెలుగు ప్రేక్షకుడికి సినిమా తమ జీవితాల్లో ఎంత ముఖ్యమన్న విషయాన్ని చెప్పకనే చెప్పేస్తున్నారు. అయితే.. త్రివిక్రమ్ చెప్పిన మాటకు మరో మాటను జత చేయాల్సిన అవసరం ఉంది.

సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు ఓపెన్ చేసుకోమన్నా చేసుకోకుండా ఉండటం  ఒక ఎత్తు అయితే.. కాస్త గ్యాప్ తో థియేటర్లు ఓపెన్ చేసినా.. ఒక మోస్తరు సినిమాలే తప్పించి పేరున్న నటీనటుల సినిమాలు కానీ.. అగ్ర దర్శకుల మూవీలు కానీ విడుదల కాని పరిస్థితి. ఇదంతా చూసినప్పుడు త్రివిక్రమ్ చెప్పినట్లుగా ప్రపంచంలో మరే జాతి చేయని సాహసం తెలుగు జాతి చేస్తుంది కానీ.. తెలుగు సినిమాలు తీసే నిర్మాతలు మాత్రం చేయటం లేదని చెప్పక తప్పదు.
Tags:    

Similar News