Maa Elections : మంచు విష్ణు ప్యానల్‌ లో ఇద్దరు సీనియర్లు

Update: 2021-09-22 15:30 GMT
మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ అధ్యక్ష ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన నేపథ్యంలో హడావుడి మొదలు అయ్యింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకుండానే అధ్యక్షులుగా పోటీ పడుతున్న ప్రకాష్ రాజ్ మరియు మంచు విష్ణు లు ప్రచారం మొదలు పెట్టారు. పెద్ద ఎత్తున వీరిద్దరు ఖర్చు కూడా చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ప్రకాష్ రాజ్ ఇప్పటికే తన ప్యానల్‌ ను ప్రకటించగా మంచు విష్ణు మాత్రం ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల అయిన తర్వాతే తన ప్యానల్‌ ను ప్రకటిస్తాను అంటూ వాయిదా వేస్తూ వచ్చాడు. ఎట్టకేలకు ఎన్నికల నోటిఫికేషన్ ను విడుదల చేసిన నేపథ్యంలో తన ప్యానల్‌ ను ప్రకటించేందుకు మంచు విష్ణు సిద్దం అయ్యాడు. ఆయన అధికారికంగా ప్రకటించకుండానే ఇద్దరు సీనియర్‌ లు ఆయన ప్యానల్‌ లో ఉన్నట్లుగా లీక్ అయ్యింది.

టాలీవుడ్‌ లో సీనియర్‌ అయిన బాబు మోహన్‌ ను మంచు విష్ణు బరిలోకి దించబోతున్నాడు. వైస్ ప్రెసిడెంట్‌ గా బాబు మోహన్ ప్రచారం చేయబోతున్నాడు.. ఇక జనరల్‌ సెక్రెటరీగా రఘు బాబును పోటీకి రెడీ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. అధ్యక్ష పదవితో పాటు జనరల్‌ సెక్రటరీ పదవికి పోటీ తీవ్రంగా ఉంది. ప్రముఖులు పలువురు జనరల్‌ సెక్రటరీ పదవికి పోటీ పడుతున్న నేపథ్యంలో ఆ పదవి ఎవరికి వస్తుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక అధ్యక్ష పదవి బరిలో పలువురు ఉన్నా కూడా కేవలం ప్రకాష్‌ రాజ్ మరియు మంచు విష్ణు ల మద్య పోటీ ఉండబోతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. మంచు విష్ణు తనను గెలిపిస్తే మా కు భవనం కట్టి తీరుతాను అంటున్నాడు. అందుకు తన సొంత నిధులు ఖర్చు చేస్తాను అంటూ కూడా ప్రకటించాడు.

ఇక ప్రకాష్ రాజ్‌ మాత్రం పేద కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తాను అంటూ బలంగా చెబుతున్నాడు. ప్రతి ఒక్క మా సభ్యులు కూడా బాధ్యత యుతంగా వ్యవహరించాలని.. ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల్లో పాల్గొనాలంటూ ప్రకాష్ రాజ్ విజ్ఞప్తి చేస్తున్నాడు. మెగా కాంపౌండ్ మద్దతు ప్రకాష్ రాజ్ కు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే నాగబాబు బాహాటంగానే ప్రకాష్‌ రాజ్ కు మద్దతు తెలిపాడు. ఇక మంచు వారికి బాలయ్య నుండి మద్దతు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ప్రకాష్‌ రాజ్‌ వైపు ఉన్న ప్యానల్‌ కు మంచి గుర్తింపు ఉంది. కనుక ఆయన్ను  అధ్యక్షుడిగా ఎన్నిక చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. మరో వైపు మంచు విష్ణు అందుకు ఏమాత్రం తగ్గకుండా తన ప్యానల్‌ ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. అందుకే సీనియర్లు అయిన బాబు మోహన్‌ మరియు రఘు బాబులను ఎంపిక చేశాడు. పూర్తి జాబితాను రేపు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
Tags:    

Similar News