వ‌రుణ్ బాక్సింగ్ మూవీ లాంచ్ తేదీ

Update: 2019-05-09 06:53 GMT
వ‌రుస ప్ర‌యోగాల‌తో త‌న‌ని తాను కొత్త‌గా ఆవిష్క‌రించుకుంటున్నాడు మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్. సోద‌రుని ఎంపికలు త‌న‌ని  ప్ర‌తిసారీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తాయ‌ని మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అంత‌టి హీరోనే ప్ర‌శంసించారంటే అర్థం చేసుకోవ‌చ్చు. ముకుంద‌-కంచె-ఫిదా-తొలి ప్రేమ‌-అంత‌రిక్షం- ఎఫ్ 2.. ఇలా ఒక‌దానితో ఒక‌టి సంబంధం లేని ఎంపిక‌ల‌తో వ‌రుణ్ తేజ్ ఆక‌ట్టుకున్నారు. ఇటీవ‌ల ప్ర‌యోగాత్మ‌కంగా తెర‌కెక్కించిన `అంత‌రిక్షం` ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వ‌క‌పోయినా వరుణ్ తేజ్ డేరింగ్ సెల‌క్ష‌న్ కి ప్ర‌శంసించ‌ని వారు లేరు.

ప్ర‌స్తుతం అత‌డు వ‌రుస‌గా భారీ ప్ర‌యోగాల‌కు శ్రీ‌కారం చుట్ట‌డంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ప్ర‌స్తుతం సెట్స్ పై ఉన్న చిత్రానికి వాల్మీకి అనే టైటిల్ ని ప్ర‌క‌టించారు. వ‌రుణ్‌ ఫ‌స్ట్ లుక్ రివీలైంది. వ‌రుణ్ తేజ్ కొత్త గెట‌ప్ కి అభిమానులు స‌హా ప‌రిశ్ర‌మ వ‌ర్గాల నుంచి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. హీరోలు నితిన్.. నాని.. అఖిల్ స‌హా ప‌లువురు ప్ర‌శంస‌లు కురిపించారు. వ‌రుణ్ ఏ సినిమాలో న‌టించినా సాటి హీరోలు అత‌డికి పూర్తి అండ‌గా నిలుస్తున్నారు. తాజాగా వాల్మీకి చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు? త‌దుప‌రి సినిమాని ఎప్పుడు ప్రారంభిస్తారు అన్న‌దానికి క్లారిటీ వ‌చ్చింది. వాల్మీకి చిత్రాన్ని ఆగ‌స్టు 15న రిలీజ్ చేస్తారు. అలాగే అదే నెల‌లో మ‌రో కొత్త సినిమాని ప్రారంభిస్తున్నార‌ని తెలుస్తోంది.

వాల్మీకి త‌ర్వాత వ‌రుణ్ న‌టించే సినిమా కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్. ఈసారి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ డ్రామాలో వ‌రుణ్ న‌టించ‌నున్నారు. ఒక బాక్స‌ర్ జీవిత‌క‌థ‌ నేప‌థ్యంలోని సినిమా ఇది. కిర‌ణ్ కొర్ర‌పాటి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. అల్లు వెంక‌టేష్ (అర‌వింద్ త‌న‌యుడు)- సిద్ధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టైటిల్ ఇంకా నిర్ణ‌యించ‌ని ఈ సినిమా ఆగ‌స్టులో సినిమా ప్రారంభం కానుంది. క‌థానాయిక‌లు వ‌గైరా వివ‌రాల్ని అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నార‌ని తెలుస్తోంది. హైద‌రాబాద్- వైజాగ్- న్యూ దిల్లీలో సినిమాని తెర‌కెక్కిస్తార‌ట‌.
    

Tags:    

Similar News