మెగాబ్ర‌ద‌ర్స్ భుజాలెక్కిన గ‌డుగ్గాయ్ ఎవ‌రు?

Update: 2019-05-10 13:22 GMT
ఆ ఫ్రేమ్ లో ముగ్గురు మొనగాళ్లున్నారు. ఆ ముగ్గురూ ఎవ‌రో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నేలేదు. అయితే దిగ్గ‌జాల్లాంటి మెగా ప‌ర్స‌నాలిటీస్ `చిరు-ప‌వ‌న్-నాగ‌బాబు` ఒకే ఫ్రేమ్ లో ఉండ‌గా.. ప‌వ‌న్ భుజాలెక్కి అంత సైలెంట్ గా అల్ల‌రి చేస్తున్న ఆ గ‌డుగ్గాయ్ ఎవ‌రై ఉంటారో ఓమారు ఊహించండి. ఇంకెవ‌రు.. త‌న‌దైన విల‌క్ష‌ణ‌త‌తో అభిమానుల‌కు చేరువైన‌ మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ త‌నే.  చిన్న‌నాటి జ్ఞాప‌కాన్ని ఇలా ఫోటో రూపంలో భ‌ద్ర‌ప‌రుచుకున్న వ‌రుణ్ తేజ్ ఇలా తీరిక స‌మ‌యం చిక్క‌గానే అలా సామాజిక మాధ్య‌మాల ద్వారా అభిమానుల‌కు చేర‌వేశాడు. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో వేగంగా వైర‌ల్ అయిపోతోంది.

బాబాయ్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ .. డాడ్ నాగ‌బాబు జ‌న‌సేన పార్టీ త‌ర‌పున ఈసారి ఎన్నిక‌ల్లో పోటీ చేసిన సంగ‌తి తెలిసిందే. 23 మే రిజ‌ల్ట్ కోసం ఎంతో ఎగ్జ‌యిటింగ్ గా వేచి చూస్తున్నారు. ప‌వ‌న్ గాజువాక స‌హా భీమ‌వ‌రం నుంచి పోటీ చేశారు. నాగ‌బాబు న‌ర‌సాపురం నుంచి పోటీకి దిగారు. ఆ ఇద్ద‌రి విక్ట‌రీ గురించి అబ్బాయ్ వ‌రుణ్ ఎంతో ఎగ్జ‌యిటింగ్ గానే వేచి చూస్తున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది. పెద‌నాన్న చిరంజీవి అన్నా.. బాబాయ్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నా వ‌రుణ్ కి ఎంతో అభిమానం. ప‌వ‌న్ కి వ‌రుణ్ అంటే ఎంత అభిమాన‌మో ఆ ఫోటోనే చెప్ప‌క‌నే చెబుతోంది.

మ‌రోవైపు వ‌రుణ్ తేజ్ వ‌రుస‌గా సినిమాల‌తో బిజీ. ప్ర‌స్తుతం హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వాల్మీకి చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అటుపై బాక్సింగ్ నేప‌థ్యం లో ఓ భారీ చిత్రంలో న‌టించేందుకు స‌న్నాహాలు చేస్తున్నాడు. త్వ‌ర‌లోనే సినిమాని ప్రారంభించ‌నున్నార‌ని తెలుస్తోంది.


Tags:    

Similar News