'నేనే వస్తున్నా' నుంచి వీరా సూర ధీర రారా..!

Update: 2022-09-21 05:16 GMT
ఇటీవల 'తిరు' చిత్రంతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న జాతీయ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్.. ఇప్పుడు 'నానే వరువెన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ''నేనే వస్తున్నా'' అనే పేరుతో తెలుగులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో 'నేనే వస్తున్నా' చిత్రాన్ని టాలీవుడ్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇటీవల ఆవిష్కరించిన ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టీజర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.

తాజాగా 'నేనే వస్తున్నా' సినిమా నుంచి 'వీరా సూర' అనే సాంగ్ లిరికల్ వీడియోని మేకర్స్ లాంచ్ చేశారు. 'వీరా సూర ధీరా రారా.. వీరా సూర ధీర రారా.. మతి బెదరా.. గతి చెదరా.. రారా రారా..' అంటూ సాగిన ఈ పాట ఆకట్టుకుంటోంది.

అడవిలో జీవనం సాగించే ధనుష్ పాత్ర గురించి ఈ పాట విస్తరిస్తోంది. ఇందులో వర్సటైల్ హీరో సరికొత్త లుక్ లో కనిపించాడు. మొత్తం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో షూట్ చేసిన ఈ సాంగ్ విజువల్ గానూ బాగుంది.

లిటిల్ మ్యాస్ట్రో యువన్ శంకర్ రాజా దీనికి ట్యూన్ కంపోజ్ చేయగా.. గేయ రచయిత చంద్రబోస్ లిరిక్స్ అందించారు. యువ గాయకుడు రాహుల్ నంబియార్ తనదైన శైలిలో ఆలపించారు.

'నేనే వస్తున్నా' చిత్రంలో ధనుష్ డ్యూయల్ రోల్ లో నటించారు. ఒకరు హీరోగా కనిపిస్తే.. మరొకరు విలన్ గా కనిపించనున్నారు. ఇప్పుడు వచ్చిన 'వీరా సూర' పాట కూడా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర గురించి చెబుతోంది.

ధనుష్ మరియు సెల్వ రాఘవన్ కలిసి ఈ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ కి కథ అందించారు. దాదాపుగా పదకొండేళ్ల తరువాత అన్నదమ్ముల కలయికలో రూపొందిన సినిమా కావడంతో అందరిలోనూ మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇందులో ధనుష్ సరసన ఇందూజ రవిచంద్రన్ మరియు గ్రీకు నటి షెల్లీ అవ్రమ్ హీరోయిన్లుగా నటించారు. సెల్వరాఘవన్ కీలక పాత్రలో నటించగా.. యోగి బాబు - ప్రభు ఇతర పాత్రలు పోషించారు. ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమాకి భువన్ శ్రీనివాసన్ ఎడిటింగ్ వర్క్ చేశారు.

వి క్రియేషన్స్ బ్యానర్ పై కలైపులి ఎస్ థాను భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 29వ తేదీన తెలుగు తమిళ భాషల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. 'నేనే వస్తున్నా' సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Full View

Tags:    

Similar News