విజయ్ దేవరకొండ వెర్షన్ అంతా కరెక్టేనా?

Update: 2020-05-05 13:30 GMT
యువ హీరో విజయ్ దేవరకొండ నిన్న కొన్ని వెబ్ సైట్ల పై నిప్పులు చెరుగుతూ పెద్ద వీడియో విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే.  తనకు ఉన్న అభ్యంతరాలు.. తన మనసులో ఉన్న అభిప్రాయాలు కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. చాలామంది స్టార్ హీరోలు కూడా విజయ్ దేవరకొండకు మద్దతుగా నిలిచారు. కొన్ని వెబ్ సైట్లు ఫేక్ న్యూస్ రాస్తున్నాయని.. తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయని.. ఇంటర్వ్యూలు ఇవ్వకపోతే  బ్లాక్ మెయిల్ చేస్తున్నాయని ఒకటి కాదు చాలా ఆరోపణలే చేశారు.

ఒకటి అరా సైట్లు అలా చేస్తున్నాయి అంటూనే అన్నీ వెబ్ సైట్లను ఒకే గాటన కట్టేసి వెబ్ సైట్లను.. అందులో పని చేసేవారిని అందరినీ కించపరిచేలా మాట్లాడడం ఏ విధంగా కరెక్టో ఆయనకే తెలియాలి.  జస్ట్ 150 రూపాయలు పెట్టి డొమైన్ కొని.. నాలుగు వేలు పెట్టి సర్వర్ కొంటే ఏవడైనా వెబ్ సైట్ పెట్టుకోవచ్చని.. తోచింది రాసుకోవచ్చని అంటున్నారు.  నిజమే అనుకుందాం..  అలా అనుకునే చాలామంది వెబ్ సైట్లు పెట్టుకుని లాక్కోలేక పీక్కోలేక చస్తున్నారనే విషయం ఎక్కువ మందికి తెలియదు.   ఒకవేళ అలా జస్ట్ 5-10 వేల రూపాయలతో వెబ్ సైట్ లు పెట్టి నోటికొచ్చింది రాస్తే చదివేది ఎవరు?

ఒక సినిమాను ప్రేక్షకులు మెప్పించేవిధంగా కాకుండా తమకు తోచినట్టు పైత్యాన్ని రంగరించి తీస్తే ఎలాగైతే తిప్పి కొడతారో .. వెబ్ సైట్లలో కూడా పాఠకులకు నచ్చని విధంగా లేకపోతే.. సినిమాలను అదే పనిగా పొగుడుతూ రాస్తే అలానే తిప్పికొడతారు.  జస్ట్ 150 రూపాయల డొమెయిన్.. నాలుగు వేలు సర్వర్ కదా.. మరి ప్రతి హీరో ఒక వెబ్ సైట్.. ప్రతి నిర్మాత ఒక వెబ్ సైట్ పెట్టి తమకు తోచినట్టు రాసుకుంటే సరిపోతుంది కదా? అందరూ చదువుతారు కదా. మరెందుకు అలా చెయ్యరు? అలా అనుకుని ఇండస్ట్రీలోని కొందరు మహామహులు ప్రారంభించిన వెబ్ సైట్ లు ఏమయ్యాయో ఇండస్ట్రీలో ఉండే వారికే చక్కగా తెలుసు. ఇక అలాంటి వెబ్ సైట్ ల పేర్లు రీడర్స్ కు ఎవరికీ అసలు తెలియక పోవడం ఇక్కడ ఓ పెద్ద వింత.

సినిమా ఇండస్ట్రీ మీద పడి.. సంపాదిస్తున్నారని.. సినిమాలు లేకపోతే వెబ్ సైట్లు నడవవని అంటున్నారు.  ఇది చులకన అభిప్రాయం తప్ప మరొకటి కాదు.   బిజినెస్ అన్న తర్వాత ఏదైనా ఎవరి మీద అయినా పడి సంపాదించాల్సిందే. ఆఖరికి ఉప్పు అమ్ముకోవాలన్నా.. పప్పు అమ్ముకోవాలన్నా.. చింతపండు అమ్ముకోవాలన్నా జనాల మీద పడి సంపాదించుకోవాల్సిందే. అంతెందుకు.. "సినిమా వాళ్ళు కూడా జనాల మీద పడి సంపాదిస్తున్నారు" అని మాట్లాడితే అది సమంజసంగా ఉంటుందా? హీరోలు రెమ్యూనరేషన్ మీద బతకడం లేదా? సినిమాలు లేకపోతే వెబ్ సైట్ లు నడవవు అంటున్నారు.  సినిమాలు లేకపోతే కాదు.. పాఠకులు లేకోపోతే వెబ్ సైట్లు నడవవు. సరే.. అలాగైతే ప్రేక్షకులు చూడకపోతే సినిమా హీరోలు ఉంటారా.. సినిమా ఇండస్ట్రీ ఉంటుందా?

వెబ్ సైట్లలో సినిమా కంటెంట్ ఉంటున్న మాట నిజమే కానీ మొత్తం అదే ఉండదు. రాజకీయాలు.. క్రీడలు.. జనరల్ న్యూస్ కూడా ఉంటాయి. అంతే కాదు. ఆదాయం మొత్తం సినిమా యాడ్స్ ద్వారానే వస్తుందని చెప్పడం కూడా శుద్ధ తప్పు.  గూగుల్ యాడ్స్ లాంటి ఇతర మార్గాలు కూడా ఉన్నాయి.  మామీద పడి 'మాత్రమే' సంపాదిస్తున్నారు అనడం సరికాదు.

సినిమా ప్రచారానికి వెబ్ సైట్ లు కావాలి.. హీరోల ఇమేజ్ బిల్డింగ్ కోసం వెబ్ సైట్ లు కావాలి. ట్విట్టర్లో టైమ్ పాస్ ఫోటోలు పెట్టి.. వాటి మీద ఆర్టికల్స్ రాయించమని చెప్పే సమయంలో వెబ్ సైట్స్ కావాలి. కొందరికి ఒక్క రూపాయ కూడా ఖర్చు కాకుండా కోట్ల రూపాయల ప్రమోషన్ కోసం వెబ్ సైట్ లు కావాలి. టీజర్ టాక్.. ట్రైలర్ టాక్.. అన్నీ పాజిటివ్ గా ఉండాలని కూడా ఒత్తిడి చేసేదెవరు?  రివ్యూల దగ్గరికి వచ్చేసరికి మాత్రం మొత్తం రివర్స్ అవుతుంది.  సినిమాలకు హిట్ రేటింగ్స్ ఇస్తే చంకలు గుద్దుకుంటారు.. బాగాలేదని చెప్తే చాలు.. భూగోళం బద్దలవుతుంది.  బాగలేని సినిమాను బాగుందని వెబ్ సైట్ లే కాదు.. ప్రేక్షకులు కూడా చెప్పరు.

వెబ్ సైట్లు ఓ అని సంపాదిస్తున్నారు అని ఒక ఏడుపు విపరీతంగా వినిపిస్తోంది. ఈ విషయం కూడా జనాలకు తెలియాల్సి ఉంది. 95% వెబ్ సైట్లు తీవ్ర నష్టాలలో ఉన్నాయనేది చేదు వాస్తవం.   కొన్ని వెబ్ సైట్ల వల్ల అక్కడక్కడ కొన్ని పొరపాట్లు జరిగి ఉండొచ్చు. మరి ఫిలిం మేకర్ల వల్ల జరగడం లేదా?  బోల్డ్ కంటెంట్ పేరిట కిస్సులను ప్రమోట్ చేసేదెవరు.. బండ బూతులను సాధారణ పదాలుగా చూపిస్తూ పిల్లలకు కూడా తెలిసేలా చేస్తున్నది ఎవరు? అంటే వెబ్ సైట్ల వల్ల ఏదో సమాజం భ్రష్టుపట్టి పోతోందని.. సినిమా హీరోల వల్ల అంతా బాగుపడిపోతోందని అనుకుంటే అంతకంటే పొరపాటు మరొకటి లేదు.  స్టాప్ ఫేక్ న్యూస్ అనేది మంచి నినాదం. భలే నినాదం.  దాంతో పాటుగా స్టాప్ ఫేక్ కలెక్షన్స్.. లాంటి ఇతర స్లొగన్స్ కూడా  మొదలుపెడితే మేలేమో.

చివరిగా.. ఇంటర్ డిపెండెన్స్(పరస్పర ఆధారితం) అనేది ప్రపంచంలో అందరికీ వర్తిస్తుంది.  అన్నీ పరస్పర ఆధారితాలు. మనం ఆన్నిటినీ ఆ దృష్టి కోణంలో చూడము అంతే.  అటు సినిమా ఇండస్ట్రీ.. ఇటు మీడియా రెండూ పరస్పర ఆధారితాలు ఆ విషయం అర్థం చేసుకుంటే అందరికీ మంచిది.


Tags:    

Similar News