‘బాహుబలి’ని వాడేసుకుందామనే అది వాయిదా

Update: 2017-05-17 11:27 GMT
రచయితగా తిరుగులేని స్థాయిని అందుకున్నారు విజయేంద్ర ప్రసాద్. ప్రస్తుతం ఇండియాలో నెంబర్ వన్ రైటర్ ఆయనే అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఐతే రచయితగా ఎంత పేరు వచ్చినా.. దర్శకుడిగానూ విజయవంతం కావాలని ఆయన ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్నారు. ఐతే దర్శకుడిగా ఆయన తొలి సినిమా ‘శ్రీకృష్ణ 2006’ పెద్ద ఫ్లాపవగా.. ‘రాజన్న’ కూడా నిరాశనే మిగిల్చింది. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన మూడో సినిమా ‘శ్రీవల్లి’కి ఆశించినంత హైప్ రాలేదు. గత ఏడాది ఆఖర్లోనే విడుదలవుతుందనుకున్న ఈ సినిమా.. చాన్నాళ్ల నుంచి వార్తల్లోనే లేదు. ఐతే ఉద్దేశపూర్వకంగానే ఈ సినిమాను పక్కన పెట్టామని అంటున్నారు విజయేంద్ర ప్రసాద్.

‘శ్రీవల్లి’ సినిమా విషయంలో తాను తప్ప ఎవ్వరూ జనాలకు పరిచయం లేదని.. నటీనటులు.. టెక్నీషియన్స్.. నిర్మాతలు.. అందరూ కొత్తవాళ్లే అని.. అందుకే ఈ సినిమాకు అనుకున్నంత హైప్ రాలేదన్నట్లుగా మాట్లాడారు విజయేంద్ర ప్రసాద్. ‘బాహుబలి: ది కంక్లూజన్’ రిలీజైతే రచయితగా తన పేరు జనాల నోళ్లలో నాని.. ఆ ప్రచారం ‘శ్రీవల్లి’కి పనికొస్తుందని ఆశించామంటూ మొహమాటం లేకుండా అసలు విషయం చెప్పేశారు విజయేంద్ర ప్రసాద్. మరి ‘బాహుబలి’ రచయిత దర్శకత్వం వహించిన సినిమాగా ‘శ్రీ వల్లి’ జనాల దృష్టిని ఎంతమేరకు ఆకర్షిస్తుందో చూడాలి. మనసును వశపరుచుకుని.. చెడు ఆలోచనలపై నియంత్రణ సాధించే ప్రయోగం నేపథ్యంలో ఓ సరికొత్త కథాశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు విజయేంద్ర ప్రసాద్. ఈ ఎరోటిక్ థ్రిల్లర్ జూన్ లో ప్రేక్షకుల ముందుకొస్తుందట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News