సగం షూట్ తర్వాత హీరోయిన్ మార్పు..!
కార్తీక్ ఆర్య హీరోగా నటిస్తున్న సినిమాలో ఆయనకు జోడీగా నటించడం ద్వారా మరింతగా పాపులారిటీ ఇమాన్వికి దక్కే అవకాశం ఉంది.
బాలీవుడ్‌లో ఆషికి సూపర్ హిట్ ప్రాంచైజీగా దూసుకు పోతుంది. ఇప్పటివరకు వచ్చిన రెండు సినిమాలకు మంచి స్పందన దక్కింది. ప్రస్తుతం ఆషికి 3 సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. అనురాగ్ బసు దర్శకత్వంలో రూపొందుతున్న ఆషికి 3లో హీరోగా కార్తిక్ ఆర్యన్ నటిస్తూ ఉండగా హీరోయిన్‌గా యానిమల్ బ్యూటీ తృప్తి డిమ్రిని ఎంపిక చేయడం జరిగింది. గత ఏడాదిలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. కార్తిక్ ఆర్యన్, తృప్తి కాంబోలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారని తెలుస్తోంది. షూటింగ్ ప్రారంభం అయ్యి కొన్ని సన్నివేశాలు చిత్రీకరించిన తర్వాత తృప్తి స్థానంలో మరో హీరోయిన్‌ను తీసుకు వచ్చేందుకు నిర్మాతలు సిద్ధం అయ్యారు.
బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుసల అనుసారం ఆషికి 3 సినిమాలో తృప్తి అందాల ఆరబోత చేస్తుందేమో కానీ ఆ పాత్రకు న్యాయం చేయలేదని చిత్ర యూనిట్ సభ్యులు భావిస్తున్నారట. అందుకే ఆమె స్థానంలో ప్రస్తుతం ప్రభాస్‌తో కలిసి ఫౌజీ సినిమాలో నటిస్తున్న ముద్దుగుమ్మ ఇమాన్విని ఎంపిక చేశారని తెలుస్తోంది. దర్శకుడు అనురాగ్ బసు ఇప్పటికే అందుకు సంబంధించిన ఫార్మాల్టీస్‌ని పూర్తి చేశాడని, త్వరలోనే సినిమా రెగ్యులర్ షూట్‌లో కార్తిక్ ఆర్యన్‌తో కలిసి ఇమాన్వి షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. తృప్తి ఎమోషనల్ సీన్స్‌లో నటించలేక పోవడం వల్లే ఆమెను తొలగించారనే వార్తలు వస్తున్నాయి.
సోషల్ మీడియా ఇన్ఫ్యూలెన్సర్ అయిన ఇమాన్విని దర్శకుడు హను రాఘవపూడి పట్టుకున్నాడు. ప్రభాస్ హీరోగా తాను రూపొందిస్తున్న సినిమాలో హీరోయిన్‌గా ఇమాన్విని ఎంపిక చేశాడు. ఫౌజీ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల చేసే వరకు ఇమాన్వి మరో సినిమాకు కమిట్ కాకూడదు అనే కండీషన్‌ను నిర్మాతలు పెట్టారు. అయితే ఫౌజీ నిర్మాతల్లో ఒకరు 'ఆషికి 3' సినిమా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అందుకే ఇమాన్విని 'ఆషికి 3'లోకి తీసుకు వెళ్లేందుకు లైన్ క్లీయర్ అయ్యింది. ఈ మధ్య కాలంలో బ్యాక్ టు బ్యాక్ విజయాలు సొంతం చేసుకున్న కార్తీక్ ఆర్య హీరోగా నటిస్తున్న సినిమాలో ఆయనకు జోడీగా నటించడం ద్వారా మరింతగా పాపులారిటీ ఇమాన్వికి దక్కే అవకాశం ఉంది.
ఇమాన్వి నటించిన ఒక్క సినిమా ఇప్పటి వరకు ప్రేక్షకుల ముందుకు రాలేదు. కానీ ఆమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. కారణం ప్రభాస్‌కి జోడీగా ఆమె నటించడం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సీతారామం సినిమాతో మృణాల్ ఠాకూర్‌కి ఎంతటి క్రేజ్ దక్కిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఈ సినిమాతో ఇమాన్వికి అదే స్థాయి స్టార్ డం దక్కుతుందని, అందుకే తర్వాత ఆమె డేట్లు దొరకడం కష్టం అవుతుందని ముందుగానే బుక్ చేసి పెట్టుకుంటున్నారట. అయితే ఫౌజీ నిర్మాతలతో ఒప్పందంలో ఉన్న కారణంగా అధికారికంగా ఇమాన్వి ఏ సినిమాకు కమిట్ అవ్వలేదు. ఎప్పుడైతే ఫౌజీ విడుదల అవుతుందో అప్పుడే ఇమాన్వి కొత్త సినిమాల ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి.