సౌత్ ట్యాలెంట్ కి బాలీవుడ్ ఎర్ర తివాచీ వేసి మరీ!
ఈ నేపథ్యంలో తాజాగా మాలీవుడ్ డైరెక్టర్ చిదంబరంకు బాలీవుడ్ ఎర్ర తివాచీ వేసి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
సౌత్ ఇండస్ట్రీ సత్తా ఏంటన్నది బాలీవుడ్ కి బాగా అర్దమైన వేళ ఇది. వరుసగా సౌత్ సినిమాలు పాన్ ఇండియాలో సత్తా చాటడంతో? సౌత్ దర్శకులతోనూ, హీరోలతోనూ కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అంతేనా మా ఇండస్ట్రీకి సైతం వచ్చి సినిమాలు చేయండని మేకర్స్ కి ఆహ్వానిస్తున్నారు. ఇటీవలే 'అమరన్' తో భారీ విజయం అందుకున్న కోలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియాస్వామికి బాలీవుడ్ లో అవకాశం వచ్చింది.
బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ , రాజ్ కుమార్ తో ఓ పాన్ ఇండియా సినిమాను తీసేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఓ భారీ చిత్రాన్ని నిర్మించడానికి భూషణ కుమార్ రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మాలీవుడ్ డైరెక్టర్ చిదంబరంకు బాలీవుడ్ ఎర్ర తివాచీ వేసి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఓ బిగ్ ప్రొడక్షన్ హౌస్ నుంచి చిదబరంకు పిలుపొచ్చినట్లు సమాచారం. ఓ స్టార్ హీరోతో సినిమా చేసేలా ఒప్పందం దిశగా సదరు సంస్థ అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
చిదంబరం గత విజయాలు చూసే అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తోంది. 'మంజుమ్మల్ బోయ్స్' సినిమాతో చిదంబరం బాగా ఫేమస్ అయ్యాడు. తెలుగులోనూ ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఓటీటీ రిలీజ్ తో దేశమంతా వెలుగులోకి వచ్చాడు. డీస్నీ హాట్ స్టార్ లో రిలీజ్ అయిన సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేట్రికల్ రిలీజ్ లో ఆ సినిమా 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఆ సినిమా బడ్జెట్ కేవలం 20 కోట్లు మాత్రమే.
చిదంబరం తొలి సినిమా 'జాన్ ఈ మ్యాన్'. ఈ చిత్రం కూడా మంచి విజయం సాధించింది. ఇలా తీసిన రెండు సినిమాలు మంచి విజయం సాధించడంతో మూడవ సినిమా ఆఫర్ ఏకంగా బాలీవుడ్ నుంచి వస్తుంది. ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అలాగే తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని కూడా బాలీవుడ్ లో 'జాట్' అనే సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో సన్ని డియోల్ హీరోగా నటిస్తున్నాడు. ఇలా సౌత్ మేకర్స్ అంతా ఒక్కొక్కరుగా బాలీవుడ్ కి వెళ్లడం విశేషం.