బాలీవుడ్ మేకర్స్ ఇంకా డైలమాలోనే..?
బాహుబలి సినిమా విడుదలైనప్పుడు హిందీ చిత్రసీమ టాలీవుడ్ ని చూసి నేర్చుకోవాలని సూచించారు కరణ్ జోహార్.
భగవద్గీత చదివితే బుద్ధి నేర్చుకునే అవకాశం కలుగుతుంది. తెలుగు సినిమాలు చూస్తే కమర్షియల్ సినిమా ఫార్మాట్ అలవాటవుతుంది.. ఇటీవలి కాలంలో చాలా మంది బాలీవుడ్ ఫిలింమేకర్స్ అభిప్రాయమిది. దేశంలో మెజారిటీగా ఉన్న మాస్ ప్రేక్షకుల కోసం సినిమాలు తీయాలని టాలీవుడ్ నిరూపిస్తోంది. బాహుబలి - బాహుబలి 2, ఆర్.ఆర్.ఆర్, సలార్, కల్కి 2898, హనుమాన్, పుష్ప, పుష్ప 2 .. ఇవన్నీ పాన్ ఇండియాలో సంచలన విజయాలు సాధించిన చిత్రాలు. ముఖ్యంగా హిందీ బాక్సాఫీస్ వద్ద అసాధారణ వసూళ్లను సాధించాయి. ఒక రకంగా తెలుగు రాష్ట్రాల కంటే ఉత్తరాది బెల్ట్ నుంచే భారీగా వసూళ్లు సాధించాయి ఈ సినిమాలు. అందుకే ప్రముఖ బాలీవుడ్ ఫిలిం క్రిటిక్స్ తరణ్ ఆదర్శ్, దర్శక నిర్మాత కరణ్ జోహార్, వెటరన్ నటుడు ముఖేష్ ఖన్నా వంటి వారు తెలుగు సినిమా ఫార్మాట్ ని చూసి నేర్చుకోవాలని హిందీ చిత్రనిర్మాతలకు పిలుపునిచ్చారు.
బాహుబలి సినిమా విడుదలైనప్పుడు హిందీ చిత్రసీమ టాలీవుడ్ ని చూసి నేర్చుకోవాలని సూచించారు కరణ్ జోహార్. బాలీవుడ్ లో దర్శకుడిగా, నిర్మాతగా సుదీర్ఘ అనుభవం ఉన్న కరణ్ చేసిన ఈ వ్యాఖ్యలు హిందీ ఫిలింమేకర్స్ ని ఆలోచింపజేసాయి. తరణ్ ఆదర్శ్ సైతం బాలీవుడ్ మారాలని సూచించారు అప్పట్లో. తెలుగు సినిమాలు బాహుబలి 2, ఆర్.ఆర్.ఆర్ రిలీజైనప్పుడు కరణ్, తరణ్ ఆదర్శ్ వంటి వారు ఈ సినిమాల విజయాల్ని కీర్తించారు. సినిమా మేకింగ్ గురించి చర్చించారు. హిందీ సినిమా తీరు తెన్నులు ఎలా మారాలో కూడా టాలీవుడ్ ని చూసి నేర్చుకోవాలని తమ వారికి చెప్పారు.
ఇటీవల హనుమాన్, సలార్, కల్కి 2898 ఏడి వంటి సినిమాలు సక్సెస్ సాధించాక చాలా మంది క్రిటిక్స్ ఇలాంటి మంచి సినిమాలు తీయాలని ప్రశంసించారు. ముఖ్యంగా హిందీ ఫిలింక్రిటిక్స్ బాలీవుడ్ ఫిలింమేకర్స్ ని తీవ్రంగా తప్పు పడుతూ విమర్శిస్తున్నారు. బాలీవుడ్ సినిమాల ఫార్మాట్ తో పాటు మేకింగ్ విధానం మారాలని సూచిస్తున్నారు. ఇప్పుడు పుష్ప 2 పాన్ ఇండియా సక్సెస్ చూసాక.. హిందీ ఫిలింమేకర్స్, విశ్లేషకుల్లో అదే అభిప్రాయం ఏర్పడింది.
ప్రముఖ వెటరన్ నటుడు, శక్తిమాన్ పాత్రధారి ముఖేష్ ఖన్నా బాలీవుడ్ దర్శకులు, చిత్రనిర్మాతలను తూర్పారబట్టారు. పుష్ప 2 సినిమాని చూసి నేర్చుకోవాలని హిందీ ఫిలింమేకర్స్ కి ఆయన సూచించారు. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటనను పొగిడేయడమే గాక .. ప్రేక్షకులకు ప్రతి పైసా గిట్టుబాటు అయ్యే సినిమా ఎలా తీయాలో విశ్లేషించారు. అల్లు అర్జున్ ఏకపాత్రాభినయాన్ని ఆయన పొగిడేశారు. అతడు శక్తిమాన్ గా నటించాలని కూడా ఆకాంక్షించారు. ముఖ్యంగా సుకుమార్ ఫిలింమేకింగ్ శైలిపైనా ఆయన ప్రశంసలు కురిపించారు. కేవలం ముఖేష్ ఖన్నా లాంటి ఒకరిద్దరు మాత్రమే కాదు.. బాలీవుడ్ లో చాలా మంది విశ్లేషకులు పుష్ప 2 పై ప్రశంసలు కురిపించారు. పుష్ప 2 చిత్రం 1000 కోట్లు పైగా వసూలు చేసి ఇప్పటికీ విజయవంతంగా థియేటర్లలో రన్ అవుతోంది. 2024లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా రికార్డులకెక్కింది. మునుముందు కల్కి 2898 ఏడి- 2, సలార్ 2 , పుష్ప 3, జై హనుమాన్ చిత్రాలతోను మన స్టార్ హీరోలు, తెలుగు ఫిలింమేకర్స్ అసాధారణ విజయాలు అందుకోవడం ఖాయమని హిందీ చిత్రసీమ ప్రముఖులు అంచనా వేస్తున్నారు. 2025లో విడుదలకు రానున్న టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాల మార్కెట్ కి ఎలాంటి డోఖా లేదని కూడా హిందీ ట్రేడ్ విశ్లేషిస్తోంది.