డైరెక్టర్ మైండ్‌లోనే కట్స్ పడాలి!
అయితే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ లంచగొండితనంపై తమిళ హీరో విశాల్ ఫిర్యాదు అనంతరం పరిణామాలు వేగంగా మారాయి.
ఇటీవల విడుదలైన రెండు భారీ సినిమాల్లో తీవ్రమైన కంటెంట్ విషయమై నెటిజనుల్లో ఆసక్తికర డిబేట్ రన్ అయింది. అందులో సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ ఒకటి కాగా, ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ మరొకటి. ఈ రెండు సినిమాలు భారీ యాక్షన్ ఎంటర్ టైనర్లు. ఇంటెన్స్ సన్నివేశాలతో తెరకెక్కినవి. అయితే `సలార్`లో అసభ్యత, హద్దు మీరిన శృంగారం వంటి కంటెంట్ లేదు కానీ భారీ యాక్షన్, హింసతో కూడుకున్న కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. అయితే సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ లో అశ్లీలత, స్త్రీ విద్వేషం, ఘాటైన సంభాషణలు, హద్దుమీరిన సన్నివేశాలు ఉన్నాయి. ప్రేక్షకుల్ని టీజ్ చేసే సీన్లకు కొదవేమీ లేదు.
అయితే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ లంచగొండితనంపై తమిళ హీరో విశాల్ ఫిర్యాదు అనంతరం పరిణామాలు వేగంగా మారాయి. ఇప్పుడు సెన్సార్ బోర్డ్ అధికారులు ఎంతో కఠినంగా మారారని చెబుతున్నారు. సీబీఎఫ్‌సి బోర్డ్ మునుపటి సీఈవోని తొలగించి ఇప్పుడు కొత్త సీఈవోని ఎంపిక చేసారు. సీబీఎఫ్‌సిలో రబీంద్ర భట్కల్ స్థానంలో స్మితా శర్మను సీఈవోగా నియమించారు. ఇప్పటికే కేసు విచారణలో ఉండడంతో సీబీఎఫ్‌సి బోర్డ్ కఠినంగా వ్యవహరిస్తోందని సమచారం. మునుపటిలా చూసీ చూడనట్టు పోలేని పరిస్థితి ఉందని చెబుతున్నారు.
అయినా యానిమల్ చిత్రానికి సెన్సార్ బోర్డ్ చాలా సన్నివేశాల విషయంలో ఎందుకు వెసులుబాటు కల్పించింది? అన్న చర్చా సాగుతోంది. ఈ సినిమాకి `ఎ` సర్టిఫికెట్ ఇచ్చినా కానీ, చాలా ఘాటైన సన్నివేశాల్ని ఎడిట్ చేయకుండా వదిలేయడంపై చాలా సందేహాలున్నాయి. ఇక ఇటీవలే విడుదలైన సలార్ కి `ఎ`సర్టిఫికెట్ ఇవ్వగా, ఇంతకుముందు విడుదలైన క్రూరమైన యాక్షన్ సినిమా `అఖండ`కు యుఎ సర్టిఫికెట్ ఇవ్వడం కూడా ఒక రకంగా సెన్సార్ అధికారులపై సందేహాల్ని లేవనెత్తాయి. సెన్సార్ అధికారుల్ని నిర్మాతలు మ్యానేజ్ చేస్తున్నారా? అన్న సందేహాలు కూడా ఉన్నాయి. అయితే ఇకపై సెన్సార్ అధికారులు ప్రాంతీయ కార్యాలయం అయినా లేదా దిల్లీలోని సీబీఎఫ్‌సి కార్యాలయం అయినా కానీ ఇకపై కఠినంగా వ్యవహరించనున్నాయని తెలుస్తోంది. మునుపటిలా ఉదారతను చూపేందుకు ఆస్కారం లేదు. ప్రస్తుతం విశాల్ ఫిర్యాదు అందుకున్న ఇన్వెస్టిగేషన్ అధికారులు కేంద్ర సెన్సార్ బోర్డ్ ని విచారిస్తోంది. ఇకపై పూర్తిగా సమాచార ప్రసారాల శాఖ పర్యవేక్షణలో సెన్సార్ బోర్డ్ కఠిన నియమాలను అమలు చేయనుంది. దీంతో మునుముందు తెరకెక్కనున్న భారీ ఇంటెన్స్ చిత్రాలకు కొన్ని ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు. ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగా యానిమల్ ని మించి యానిమల్ పార్క్ లో తీవ్రమైన సన్నివేశాలుంటాయని చెబుతున్నాడు. అలాగే లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన విక్రమ్ సినిమా కూడా భారీ యాక్షన్ సినిమా. దీనికి సీక్వెల్ లో సూర్య పాత్రను మరింత క్రూరంగా ఎలివేట్ చేయనున్నారు. అయితే మారిన సెన్సార్ నిబంధనలతో దర్శకులు ఇంటెన్సిటీని తగ్గించాల్సి ఉంటుందనే భావిస్తున్నారు. సెన్సార్ గడపపై కాదు.. డైరెక్టర్ మైండ్ లోనే కట్స్ పడాల్సి ఉంటుందని కూడా భావిస్తున్నారు.