డిమోంటే కాలనీ 2 తెలుగులో వచ్చేది ఎప్పుడంటే..

తమిళంలో అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం డిమోంటే కాలనీ 2.

Update: 2024-08-16 10:52 GMT

తమిళంలో అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం డిమోంటే కాలనీ 2. హర్రర్ కామెడీ జోనర్ లో ఈ సినిమాని దర్శకుడు అజయ్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. 2015లో వచ్చిన హర్రర్ కామెడీ డిమోంటే కాలనీ సినిమాకి సీక్వెల్ గా ఈ మూవీ వచ్చింది. చియాన్ విక్రమ్ తంగలాన్ కి పోటీగా ఆగష్టు 15న ఈ చిత్రాన్ని తీసుకొచ్చారు. అయితే మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో సీక్వెల్ పైన కూడా భారీ అంచనాలు క్రియేట్ అయ్యి ఉన్నాయి.


అలాగే హర్రర్ కామెడీకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. దీంతో డిమోంటే కాలనీ 2 చిత్రానికి మంచి ఆదరణ లభించినట్లు తెలుస్తోంది. నిజానికి తమిళ్, తెలుగు భాషలలో ఒకే సారి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే ఏవో కారణాల వలన తెలుగు వెర్షన్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొని రాలేకపోయారు. ఇదిలా ఉంటే తాజాగా డిమోంటే కాలనీ 2 తెలుగు వెర్షన్ రిలీజ్ డేట్ ని చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేసింది. ఆగష్టు 23న తెలుగులో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.

తెలుగులో కూడా డిమోంటే కాలనీకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. గత కొన్నేళ్లుగా టాలీవుడ్ లో హర్రర్ కామెడీ జోనర్ లో వచ్చిన సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. కానీ ప్రేక్షకులు మాత్రం హర్రర్ కామెడీని బాగానే ఆస్వాదిస్తారు. సరైన కంటెంట్ తో మూవీ పడితే కచ్చితంగా థియేటర్స్ హౌస్ ఫుల్ అవుతాయని డిస్టిబ్యూటర్స్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డిమోంటే కాలనీ 2 సినిమాని తెలుగులో రిలీజ్ కి ఏర్పాట్లు చేస్తున్నారు.

డిమోంటే కాలనీ 2 తెలుగు ట్రైలర్ కి యుట్యూబ్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో కచ్చితంగా తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరిస్తారని నిర్మాతలు అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో అరుళ్ నిధి లీడ్ రోల్ లో నటించాడు. ప్రియా భవానీ శంకర్, అర్చన రవిచంద్రన్, మీనాక్షి గోవిందరాజన్ హీరోయిన్స్ గా ఫీమేల్ లీడ్ రోల్స్ లో కనిపించారు.

ఈ సినిమాకి క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు చాలా థ్రిల్లింగ్ గా ఉందనే మాట వినిపిస్తోంది. ఆడియన్స్ నుంచి కూడా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాకి కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News