ఎంతసేపూ సమాజం నుంచి తీసుకోవడం కాదు: పవన్ కల్యాణ్
బ్రో సినిమా ఎలా ప్రారంభమైందో పవన్ వివరిస్తూ
''నటుడవ్వాలని, రాజకీయాల్లోకి రావాలని నేనెప్పుడూ ఊహించలేదు. ఇది నేను కోరుకున్న జీవితం కాదు. భగవంతుడు నాకు ఇచ్చిన జీవితం. ఏరోజు కూడా చాలా చిన్న జీవితాన్ని బ్రతకాలి అనుకున్నాను తప్ప ఇలా అవ్వాలని అనుకోలేదు'' అని అన్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో పవన్ కల్యాణ్ కీలక పాత్రలో నటించిన బ్రో ఈనెల 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ప్రీరిలీజ్ వేడుకలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు. బ్రో ఈవెంట్లో పవన్ స్పీచ్ ఆద్యంతం అభిమానులు సహా ప్రజల్లో ఎంతో స్ఫూర్తిని నింపింది.
పవన్ మాట్లాడుతూ-''ఎంతసేపూ సమాజం నుంచి తీసుకోవడం కాదు.. సమాజానికి ఏదైనా ఇవ్వాలి. నేను సినిమా చేసేటప్పుడు సమాజానికి ఉపయోగపడే ఎంతోకొంత చిన్నపాటి ఆలోచన ఉంటే బాగుంటుంది అనుకుంటాను...'' అని ఈ వేడుకలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
బ్రో సినిమా ఎలా ప్రారంభమైందో పవన్ వివరిస్తూ.. ''కరోనా సమయంలో ఒకసారి ప్రముఖ దర్శకులు, మిత్రులు త్రివిక్రమ్ ఫోన్ చేశారు. సముద్రఖని గారి దగ్గర ఓ కథ విన్నాను.. చాలా బాగుందన్నారు. నాకు ఒకసారి కథ నచ్చిందంటే రచయితను.. దర్శకుడిని సంపూర్ణంగా నమ్మేస్తాను. అంత నమ్మకంగా ఈ సినిమా చేశాను. సముద్రఖని రాసిన కథకి త్రివిక్రమ్ సరికొత్త స్క్రీన్ ప్లే అందించారు. అభిమానులను దృష్టిలో పెట్టుకొని ఆయన కథనాన్ని చాలా బాగా అభివృద్ధి చేశారు'' అని తెలిపారు.
ఇది నేను కనీసం 50 నుంచి 70 రోజులు చేయాల్సిన సినిమా. సంపూర్ణ సినిమా.. నవ్విస్తుంది.. ఏడిపిస్తుంది.. ఎమోషన్స్ రగిలిస్తుందని పవన్ అన్నారు. సినిమా అంటే ఇష్టం నాకు, కానీ సమాజం అంటే బాధ్యత. సినిమా అంటే ప్రేమ నాకు. జూనియర్ ఎన్టీఆర్ గారిలా.. రామ్ చరణ్ లాగా నేను గొప్పగా డ్యాన్స్ లు చేయలేకపోవచ్చు.
ప్రభాస్ గారిలా.. రానా గారిలా సంవత్సరాలు కష్టపడి చేయలేకపోవచ్చు. సాయి తేజ్- వరుణ్ తేజ్- వైష్ణవ్ తేజ్ వీళ్ళందరికీ నేను ఒకటే చెప్తాను. ఈ సినీ పరిశ్రమ ఏ ఒక్కరికి చెందినది కాదు. మా కుటుంబానికి కూడా చెందినది కాదు.. ఇది అందరిదీ. ఈ కోట్లాదిమందిలో ఎవరైనా సరే బలంగా అనుకుంటే ఇక్కడ రాణించగలరు... అంటూ పవన్ స్ఫూర్తివంతమైన స్పీచ్ తో ఆకట్టుకున్నారు.