'ఇన్సెప్షన్' దర్శకుడితో దేశీ సూపర్‌స్టార్?
ఇన్సెప్షన్, డన్ కిర్క్, ఓపెన్ హీమర్ లాంటి క్లాసిక్స్ ని తెరకెక్కించిన క్రిస్టోఫర్ నోలాన్ కి ప్రపంచవ్యాప్తంగా అసాధారణ ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసిందే.;

ఇన్సెప్షన్, డన్ కిర్క్, ఓపెన్ హీమర్ లాంటి క్లాసిక్స్ ని తెరకెక్కించిన క్రిస్టోఫర్ నోలాన్ కి ప్రపంచవ్యాప్తంగా అసాధారణ ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసిందే. అతడు రూపొందించిన ఇంటర్ స్టెల్లార్ ఇటీవల భారత్ లో రీరిలీజ్ అయ్యి గ్రాండ్ సక్సెస్ అయింది. దీనిని బట్టి భారతదేశంలో అతడి ఫాలోయింగ్ ఏ రేంజులో ఉందో అర్థం చేసుకోవచ్చు.
అయితే నోలాన్ దర్శకత్వంలో నటించాలనుందని బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ వ్యాఖ్యానించడం ఆసక్తిని కలిగిస్తోంది. ఆయనతో ఏమాత్రం అవకాశం ఉన్నా తాను వదులుకోనని అతడు అన్నాడు. నోలాన్ అంటే తనకు ఎంతటి అభిమానం ఉందో కూడా అతడు తన అమెరికా పర్యటనలో వెల్లడించాడు.
నిజానికి హృతిక్ ఛరిష్మా ఒక హాలీవుడ్ స్టార్ కి ఎంతమాత్రం తగ్గదు. భారీ యాక్షన్ చిత్రాలకు అతడు సూటబుల్. అతడి నటప్రతిభ, యాక్షన్, డ్యాన్సులను మెచ్చనివారు లేరు. అందుకే క్రిస్టోఫర్ నోలాన్ లాంటి అసాధారణమైన దర్శకుడితో అతడు సినిమా చేస్తే అది ఫ్యాన్స్ ని ఎంతో ఎగ్జయిట్ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
అయితే 50 ఏళ్ల హృతిక్ రోషన్ కాస్త ఆలస్యంగా ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషిస్తున్నారు. పదేళ్ల క్రితం ఆయనలోని ఎనర్జీకి నోలాన్ లాంటి డైరెక్టర్ యాడైతే వండర్స్ సృష్టించేవారని భావిస్తున్నారు. అయితే ఏజ్ లెస్ గ్రీకువీరుడిగా హృతిక్ లో చేవ ఇంకా తగ్గలేదు గనుక.. ఇప్పుడైనా కొంపలంటుకునేదేమీ లేదని కూడా విశ్లేషిస్తున్నారు. హృతిక్ ప్రస్తుతం `వార్ 2`లో నటిస్తున్నాడు. ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు. తదుపరి హృతిక్ స్వీయదర్శకత్వంలో క్రిష్ 4ని తెరకెక్కిస్తారు. అందులో అతడు కథానాయకుడిగాను నటించనున్నాడు.