సెట్ పైకప్పు కూలి స్టార్లకు గాయాలు.. అధికారిక ప్రకటన ఏదీ?
అయితే ఇప్పుడు సెట్ పై కప్పు కూలి పడిన ఘటనలో కొందరు స్టార్లు సహా పలువురికి గాయాలయ్యాయి.
కొన్నిసార్లు షూటింగ్ జరిగేప్పుడు సెట్లో ఊహించని ప్రమాదాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో ఎక్కువగా స్టార్లకు గాయాలవ్వడం చూస్తున్నదే. అయితే ఇప్పుడు సెట్ పై కప్పు కూలి పడిన ఘటనలో కొందరు స్టార్లు సహా పలువురికి గాయాలయ్యాయి. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరూ మరణించలేదని, తీవ్ర గాయాలు కాలేదని కూడా చిత్రబృందం ప్రకటించింది. ఈ ప్రమాదం ఏ సెట్‌లో జరిగింది? గాయపడిన తారలు ఎవరు? అంటే వివరాల్లోకి వెళ్లాలి.
అర్జున్ కపూర్, భూమి పెడ్నేకర్, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన 'మేరే హస్బెండ్ కి బివి' షూటింగ్‌లో దురదృష్టకర సంఘటన జరిగింది. చిత్రబృందం ముంబైలో షూటింగ్ చేస్తున్న సమయంలో సెట్ పైకప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో కథానాయకుడు అర్జున్ కపూర్, చిత్రనిర్మాత జాకీ భగ్నాని(రకుల్ ప్రీత్ భర్త), దర్శకుడు ముదస్సర్ అజీజ్ సహా పలువురు సిబ్బంది గాయపడ్డారు. అయితే ప్రాణనష్టం జరగలేదని ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) అధ్యక్షుడు బిఎన్ తివారీ వెల్లడించారు. పెద్ద గాయాలు అవ్వలేదని భరోసానిచ్చారు.
నిర్వహణ లేకపోవడం వల్ల స్టూడియోలో పైకప్పు కూలిపోయింది.. సమాఖ్య కూడా దీర్ఘకాలిక మార్పులను తీసుకురావడానికి ప్రయత్నిస్తోందని కార్మిక సంఘం అధ్యక్షుడు తివారీ పేర్కొన్నారు. ''పరిశ్రమలోని కార్మికుల ఆరోగ్యం, భద్రతపై ఢిల్లీలోని ప్రధానమంత్రికి, మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక లేఖ పంపాము. పునాదులు చాలా పాతవి కాబట్టి అవి ఎప్పుడైనా కూలిపోవచ్చని మేము ఫిల్మ్ సిటీకి కూడా లేఖ రాశాము. కాబట్టి నిర్మాణాత్మక ఆడిట్ చేయవలసి ఉంది. అగ్ని ప్రమాదాలు జరిగినా ఇక్కడ భద్రతకు నిష్క్రమణ ద్వారం లేదు.. అని ఆయన తెలిపారు.
చాలా కాలంగా కార్మికుల కోసం, ప్రభుత్వంతో పాటు పరిశ్రమతో కూడా పోరాటం చేస్తున్నానని తివారీ నొక్కి చెబుతున్నారు. టీవీ పరిశ్రమ వచ్చినప్పటి నుండి సమస్య పెరిగింది. ఎందుకంటే టీవీ బృందం ఒకే రోజు షూట్ చేసి వెంటనే ప్రసారం చేయాలి. నియంత్రిత పని గంటలు లేదా ఉద్యోగ భద్రత లేదు అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి సంఘటనలు ప్రతిరోజూ జరుగుతూనే ఉన్నాయి.. కానీ పరిహారం లేదు.. అని అన్నారు.
సెట్‌లో ఇలాంటి సంఘటన జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? అని ప్రశ్నించగా.. ఇది ఆర్ట్ డైరెక్టర్ బాధ్యత, కానీ స్టూడియో యజమాని బాధ్యత ఇంకా ఎక్కువ. కానీ వారు స్టూడియోను తయారు చేసి, దానిని నిర్వహించకుండా బుకింగ్‌లు తీసుకుంటూనే ఉన్నారు. ప్రభుత్వం చర్య తీసుకోకపోతే, సినిమా షూటింగులు ముంబై నుండి తరలిపోతాయి అని వ్యాఖ్యానించారు.