శతమానం భవతి సీక్వెల్ కోసం ఈసారి యువ దర్శకుడు
ఇంకొక ఆసక్తికర విషయమేంటంటే, ఈ సినిమాకు దిల్ రాజు ఈసారి కొత్త డైరెక్టర్‌ను తీసుకురాబోతున్నాడు.;

తెలుగు సినిమా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన కుటుంబ కథా చిత్రాల్లో శతమానం భవతి ఒకటి. 2017లో విడుదలైన ఈ చిత్రం సంక్రాంతి బరిలో ఘనవిజయం సాధించి, జాతీయ అవార్డు కూడా గెలుచుకుంది. దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ఈ హిట్ మూవీకి ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కించేందుకు ప్లానింగ్ జరుగుతోంది.
ఇప్పటికే ఈ సీక్వెల్ పై దిల్ రాజు సీరియస్‌గా పని చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం “శతమానం భవతి: ది లాస్ట్ పేజ్” అనే టైటిల్‌ను పరిశీలనలో పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ టైటిల్ నుంచే సినిమా ఓ ఎమోషనల్ ఎండ్ నోటున పయనించబోతోందన్న ఊహలు మొదలయ్యాయి. నెక్స్ట్ జనరేషన్, ఫ్యామిలీ విలువల నేపథ్యంలో సినిమా ఉండే అవకాశముంది.
ఇంకొక ఆసక్తికర విషయమేంటంటే, ఈ సినిమాకు దిల్ రాజు ఈసారి కొత్త డైరెక్టర్‌ను తీసుకురాబోతున్నాడు. సతీష్ వేగేశ్న మొదటి సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. కానీ ఈసారి అతను సెట్టవ్వలేదట. వంశీ పైడిపల్లి టీమ్‌లో అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఒకరు ఈ సీక్వెల్‌తో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. కుటుంబ కథా చిత్రాలకు ఉన్న సెన్సిబిలిటీ, ఎమోషన్లపై దృష్టితో ఆ డైరెక్టర్‌కు ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
హీరోగా దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ ఎంపికయ్యాడట. ఇప్పటికే రౌడీ బాయ్స్.. అలాగే ఇతర ప్రాజెక్ట్స్‌తో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్న ఆశిష్‌కు ఇది ఓ సెంటిమెంటల్ బ్రేక్ కావచ్చు. అసలు శతమానం భవతి బ్రాండ్‌కు సీక్వెల్ అంటే, ఆ లోకల్ ఫ్యామిలీ కనెక్ట్, విలేజ్ బ్యాక్‌డ్రాప్‌ను మరోసారి తెరపై చూపించాలి. ఆ బాధ్యత ఆశిష్ మీద ఉండబోతోంది.
ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పూర్తి దశలో ఉన్నట్లు సమాచారం. అన్ని అనుకూలంగా జరిగితే, ఈ సినిమా షూటింగ్ మిడిల్ ఆఫ్ 2025లో మొదలై, సంక్రాంతి 2026 కి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతికి దిల్ రాజు పెట్టే సినిమాలు భిన్నంగా ఉండే ట్రెండ్ ఉంది. ఈసారి కూడా అదే వాతావరణాన్ని కలిగించాలనే ఉద్దేశంతో ఈ సీక్వెల్‌ను సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి, శతమానం భవతి మళ్లీ తెరపైకి వస్తుందనే వార్తతో ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. కొత్త దర్శకుడు, కొత్త హీరో అయినా, అదే ఇంటి కథ, అదే తెలుగు సంస్కృతి నేపథ్యం ఉండబోతుందట. మరి ఈ ప్రయోగం కూడా మొదటి భాగంలా ప్రేక్షకుల హృదయాలను గెలుస్తుందేమో చూడాలి.