'గేమ్ చేంజర్' స్థాయికి నేను రాలే!
అంత పెద్ద పొలిటికల్ మూవీని తీసే అనుభవం మరియు స్థాయి నాకు లేదు. అందుకే కథ ను శంకర్ సర్ కి వినిపించాను.
తెలుగు మరియు తమిళ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ చిత్రం 'గేమ్ చేంజర్'. టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు కాస్త మెల్లగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.
గేమ్ చేంజర్ సినిమాకి శంకర్ దర్శకత్వం వహిస్తున్నప్పటికీ... కథ ను అందించింది మాత్రం ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ అనే విషయం తెల్సిందే. తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్న దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్. ఈయన గేమ్ చేంజర్ కి కథ ను అందించడం చాలా ప్రత్యేకమైన విషయం.
తాజాగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన జిగర్ తండ డబుల్ ఎక్స్ విడుదలకు సిద్ధం అయింది. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా కార్తీక్ సుబ్బరాజ్ ఒక ఇంటర్వ్యూలో గేమ్ చేంజర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన కెరీర్ లోనే మొదటి పొలిటికల్ స్టోరీ గేమ్ చేంజర్. ఆ కథ ను పూర్తి చేసిన తర్వాత నా సన్నిహితులకు చెప్పాను.
వారిలో చాలా మంది కథ చాలా బాగుంది, శంకర్ సినిమాల స్థాయిలో ఈ సినిమా చాలా పెద్దగా చేయవచ్చు అన్నారు. భారీగా ఆ కథ ను చేస్తే బాగుంటుందని అంతా అన్నారు. అంత పెద్ద పొలిటికల్ మూవీని తీసే అనుభవం మరియు స్థాయి నాకు లేదు. అందుకే కథ ను శంకర్ సర్ కి వినిపించాను. ఆయన తీసేందుకు సిద్ధం అయ్యారని కార్తీక్ పేర్కొన్నాడు.
శంకర్ సర్ అనుకున్నట్లుగానే చాలా పెద్ద స్థాయి లో గేమ్ చేంజర్ సినిమాను రూపొందిస్తున్నారు. రామ్ చరణ్ వంటి స్టార్ హీరో తో ఈ సినిమా ను రూపొందించడం వల్ల సినిమా స్థాయి మరింత పెరిగిందని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. గేమ్ చేంజర్ సినిమా తప్పకుండా అలరిస్తుందని తమిళ మరియు తెలుగు సినీ ప్రేక్షకులు మరియు ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు.