కింగ్డమ్ వర్సెస్ హిట్ 3... ఇంట్రస్టింగ్ ఫైట్!
కింగ్డమ్ సినిమా కచ్చితంగా వంద కోట్ల సినిమా అని, గౌతమ్ తిన్ననూరి స్టైల్ కేజీఎఫ్ మూవీ అంటూ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగవంశీ సైతం చెప్పుకొచ్చాడు.
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో రూపొందుతున్న 'కింగ్డమ్' సినిమా టీజర్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తక్కువ సమయంలోనే టీజర్‌కి 15 మిలియన్‌ల వ్యూస్ రావడంతో సినిమాకు ఏ స్థాయిలో బజ్ క్రియేట్ అయిందో అర్థం చేసుకోవచ్చు అంటూ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తెగ హడావుడి చేశారు. కింగ్డమ్ సినిమా కచ్చితంగా వంద కోట్ల సినిమా అని, గౌతమ్ తిన్ననూరి స్టైల్ కేజీఎఫ్ మూవీ అంటూ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగవంశీ సైతం చెప్పుకొచ్చాడు. కింగ్డమ్ సినిమా పై అంచనాలు కచ్చితంగా భారీగా పెరిగాయి. అయితే అంతకు మించి అన్నట్లుగా హిట్ 3 ఉందని నాని ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు.
నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ 'హిట్ 3'. షూటింగ్ ముగింపు దశకు చేరుకున్న హిట్ 3 సినిమాను మే 1న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇటీవల నాని పుట్టిన రోజు సందర్భంగా లాఠీ అంటూ ఒక టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. నాని హిట్ 3 సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో గట్టిగా హిట్ కొట్టబోతున్నాడు అనే నమ్మకంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో హిట్ 3 సినిమాకు అనూహ్య స్పందన దక్కింది. కేవలం 24 గంటల్లో హిట్ 3 టీజర్‌ని ఏకంగా 16 మిలియన్‌ల మంది చూశారు. దాంతో హిట్ 3 కి ఉన్న బజ్ ఏంటో అర్థం అయిందని నాని అభిమానులు అంటున్నారు.
విజయ్ దేవరకొండ కింగ్డమ్, నాని హిట్ 3 సినిమాల విడుదలకు సరిగ్గా నెల రోజుల గ్యాప్ ఉంది. మొదట నాని 'హిట్ 3' సినిమా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. మే 1న విడుదల కాబోతున్న హిట్ 3 ఇప్పటికే రెండు సార్లు సక్సెస్ అయింది. హిట్ ప్రాంచైజీలో రాబోతున్న మూడో సినిమా కావడంతో మినిమం గ్యారెంటీ అనే నమ్మకంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అందుకే ముందస్తు బజ్ క్రియేట్ అయింది. కనుక టీజర్ విడుదలైన వెంటనే పెద్ద ఎత్తున స్పందన దక్కింది. హిట్ 3 సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే ఈ రేంజ్ బజ్ క్రియేట్ అయితే విడుదల సమయంకు ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.
ఇక కింగ్డమ్ సినిమా గత కొన్ని రోజులుగా ఊరిస్తూ వస్తుంది. గౌతమ్ తిన్ననూరి సైతం మంచి సినిమాలను అందించిన దర్శకుడిగా పేరు దక్కించుకున్నాడు. అయితే విజయ్ దేవరకొండ గత చిత్రాల ఫలితం నేపథ్యంలో ఈ సినిమా ఫలితం విషయంలో ఒకింత అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాన్స్ మాత్రం రౌడీ స్టార్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా కింగ్డమ్ నిలుస్తుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా మే 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ రెండు సినిమాలు నాలుగు వారాల గ్యాప్‌తో రాబోతున్నాయి. కనుక ఒకదాని ప్రభావం మరోదానిపై ఉండదు. కానీ ఫ్యాన్స్ మాత్రం రెండు సినిమాల ఫలితాలపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టీజర్ విషయంలో నాని 'హిట్ 3' పై చేయి సాధించింది. ఆ తర్వాత రాబోతున్న ట్రైలర్, విడుదల తర్వాత కలెక్షన్స్ విషయంలో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి.