టీవీ టు మూవీ.. నటుడి ఆస్తులు 115కోట్లు
స్వయంకృషితో ఒక సాధారణ మధ్యతరగతి యువకుడు ఎలా ఎదగాలో నేర్పించే స్ఫూర్తివంతమైన పాఠం అతడు.
టీవీ రంగంలో రాణించి అటుపై నెమ్మదిగా పెద్ద తెరవైపు అడుగులు వేసిన ఒక నటుడు ఆ తర్వాత పెద్ద స్టార్ గా ఎదిగాడు. ఏడాదికి సుమారు నాలుగైదు చిత్రాల్లో అలవోకగా నటించే ఈ స్టార్ ఏకంగా 100 కోట్లు పైగా ఆర్జించాడు. అంచెలంచెలుగా అతడు ఎదిగిన విధానం సూపర్‌స్టార్ గా నీరాజనాలు అందుకుంటున్న వైనం ఇప్పుడు ప్రముఖంగా చర్చకు వచ్చాయి. స్వయంకృషితో ఒక సాధారణ మధ్యతరగతి యువకుడు ఎలా ఎదగాలో నేర్పించే స్ఫూర్తివంతమైన పాఠం అతడు.
ఇదంతా ఎవరి గురించి? అంటే ది గ్రేట్ మ్యాడీ అలియాస్ ఆర్.మాధవన్ గురించే. తనదైన విలక్షణ నటనతో దశాబ్ధాలుగా అలరిస్తున్న ఆర్ మాధవన్ హిందీ, తమిళ ఇండస్ట్రీలో ఒక్కో సినిమాతో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంటూ ఇంతింతై అన్న చందంగా ఎదిగి ఇప్పటి ఉన్నత స్థితిని దక్కించుకున్నాడు. సఖి నుంచి సైతాన్ వరకూ.. 3 ఇడియట్స్ నుండి షైతాన్ వరకు అతడి కెరీర్ ఎదుగుదలను డీకోడ్ చేస్తే, ఇప్పుడు అతడు స్థిరమైన ఆదాయంతో ఓ వెలుగు వెలుగుతున్నాడు.
ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ విజయం సాధించిన షైతాన్‌లో డెవిల్‌గా నటించినందుకు ఆర్ మాధవన్ ప్రశంసలు అందుకున్నాడు. అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ హారర్ చిత్రంలో అతడు విలన్‌గా నటించాడు. మ్యాడీ గత 15 సంవత్సరాలలో హిందీ , తమిళ పరిశ్రమలలో పారితోషికాల పరంగా అసాధారణ పెరుగుదలను చూశాడు.
మ్యాడీ చాలా కాలంగా నటనలో ఉన్నాడు. అతడు తొలిగా టెలివిజన్ రంగంలో అరంగేట్రం చేసాడు. దూరదర్శన్‌లో సీ హాక్స్, జీ టీవీలో జమై రాజా & సోనీ టీవీలో సాయా వంటి టీవీ సిరీస్‌లతో ప్రేక్షకులను అలరించాడు. తరువాత 2001లో `రెహనా హై తేరే దిల్ మే`తో తన హిందీ సినీ రంగ ప్రవేశం చేశాడు.
తను వెడ్స్ మను- తను వెడ్స్ మను రిటర్న్స్, రన్, 13బి, త్రి ఇడియట్స్ సహా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన మాధవన్ ఇప్పటికి దాదాపు 115 కోట్ల నికర ఆస్తులను కలిగి ఉన్నాడు. ఇటీవల అతడు ఒక ఇంటర్వ్యూలో కెరీర్ ఆరంభం నాలుగేళ్లలో అస్సలు డబ్బు సంపాదించలేదని తన రోజువారీ అవసరాల కోసం డీకపుల్డ్ వెబ్ సిరీస్ చేసానని ఒప్పుకున్నాడు. ఆ స్థాయి నుంచి ఇప్పుడు కోట్లలో ఆర్జించేంతగా ఎదిగాడు.
రాజ్‌కుమార్ హిరాణీ 3 ఇడియట్స్‌లో ఫర్హాన్ పాత్ర పోషించినందుకు కేవలం 65 లక్షలు మాత్రమే చెల్లించారు. అయితే పారితోషికం పట్టించుకోకపోతే ఈ చిత్రంలో తన పాత్రను ప్రేక్షకులు గొప్పగా ప్రేమించారు. 2009లో ఒక్కో సినిమా కోసం చాలా తక్కువ మొత్తంలో పారితోషికం అందుకోగా.. ఇప్పుడు అతడు ఒక్కో సినిమాకి 10కోట్లు అంతకుమించి అందుకుంటున్నాడు. తాజా హారర్ చిత్రం `షైతాన్` కోసం అతడు 10 కోట్లు అందుకున్నాడు.
గత 15 ఏళ్లలో ఆర్ మాధవన్ పారితోషికం రేంజ్ 1468 శాతం పెరిగింది. ఇది భారీ వృద్ధి. మ్యాడీ సాధారణంగా సంవత్సరానికి 12-15 కోట్లు సంపాదిస్తాడు. ఇంతకుముందు ఒక ప్రాజెక్ట్‌కి 6-8 కోట్లు వసూలు చేసేవాడు. బ్రీత్ అనే వెబ్ సిరీస్ కోసం అతడు భారీ మొత్తం అందుకున్నాడు. ఇప్పటికి మాధవన్ నికర ఆస్తుల విలువ 115 కోట్లు. ఇక అతడి సహనటి జ్యోతిక మొత్తం ఆస్తులు 331 కోట్లు!
విలాసవంతమైన నివాసాలు-కార్లు బైక్‌లు
ఆర్ మాధవన్ చెన్నైలో 18 కోట్ల ఖరీదు చేసే భారీ బంగ్లాను కలిగి ఉన్నాడు. ముంబైలో తన కొడుకు, భార్యతో కలిసి ఒక విలాసవంతమైన అపార్ట్‌మెంట్లో నివసిస్తున్నాడు. అక్కడ అతడు సేంద్రీయ కూరగాయలను పండించడాన్ని ఇష్టపడతాడు. అపార్ట్ మెంట్లో భారీ పూల్ టేబుల్ కూడా ఉంది. మ్యాడీ స్వతహాగా క్రీడాప్రేమికుడు. తన కొడుకు స్విమ్మింగ్‌లో మెరుగ్గా శిక్షణ పొందాలని దుబాయ్‌లో ఓ విల్లా అద్దెకు తీసుకుని కొన్నాళ్లుగా అక్కడే ఉంటున్నాడు.
మాధవన్ కి 80 లక్షల విలువైన మెర్సిడెస్ బెంజ్ .. 1 కోటి విలువైన రేంజ్ రోవర్ ఉన్నాయి. అతడు బైక్‌లను ఇష్టపడతాడు. 40 లక్షల విలువైన రోడ్‌మాస్టర్ క్రూయిజర్ అతడి సొంతం. అతడి ఇతర బైక్ కలెక్షన్ లో యమహా V-Max, BMW K1600 GTL , డుకాటి డయావెల్ ఉన్నాయి.