మోత మోగించేసిన మురారి

తెలుగులో రీ రిలీజ్ ట్రెండ్ రెండేళ్లుగా ఒక రేంజిలో నడుస్తుండడంలో మహేష్ బాబు అభిమానులది కీలక పాత్ర.

Update: 2024-08-09 09:58 GMT

తెలుగులో రీ రిలీజ్ ట్రెండ్ రెండేళ్లుగా ఒక రేంజిలో నడుస్తుండడంలో మహేష్ బాబు అభిమానులది కీలక పాత్ర. రెండేళ్ల కిందట సూపర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా పోకిరి సినిమా రీ రిలీజ్‌ను ఒక రేంజిలో ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసిన విధానానికి ఇండస్ట్రీ జనాలు కూడా షాకైపోయారు. కొత్త సినిమాల తరహాలో భారీగా షోలు వేయడం.. అవన్నీ అడ్వాన్స్ ఫుల్స్ కావడం.. అభిమానులు థియేటర్ల బయట, లోపల నానా హంగామా చేయడం చూసి జనాలకు పిచ్చెక్కిపోయింది. ఆ తర్వాత చాలామంది స్టార్ల ఫ్యాన్స్ ఇదే బాటలో నడిచారు.

కొన్ని చిత్రాలకు వచ్చిన వసూళ్లు, థియేటర్లలో నెలకొన్న సందడి ఆశ్చర్యపరిచింది. ఐతే ఈ మధ్య రీ రిలీజ్ ట్రెండ్ కొంచెం డల్ అయింది. పాత సినిమాలను ఇంతకుముందులా పట్టించుకోని పరిస్థితి తలెత్తింది. కానీ ఈ రోజు మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ‘మురారి’ సినిమాకు రీ రిలీజ్ ప్లాన్ చేసిన విధానం.. థియేటర్లలో హంగామా చూశాక మహేష్ ఫ్యాన్స్ వ్యవహారమే వేరు అనిపించేలా ఉంది.

ఇప్పటిదాకా వచ్చిన రీ రిలీజ్‌లు వేరు.. మురారి వేరు అనేలా ఉంది ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి చూస్తే. రిలీజ్‌కు కొన్ని రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే రూ.2 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం ద్వారా ఆల్రెడీ మురారి సంచలనం రేపింది. ఇక శుక్రవారం పొద్దున మురారి థియేటర్ల దగ్గర సంబరాలు మామూలుగా లేవు.

మహేష్ అభిమానుల ఉత్సాహం పతాక స్థాయికి చేరుకుంది. థియేటర్లలో కూడా సందడి ఒక రేంజిలో కనిపిస్తోంది. ఇక దర్శకుడు కృష్ణవంశీ స్వయంగా రీ రిలీజ్ ప్రింట్‌ రెడీ చేయించడంతో 4కే క్వాలిటీ మామూలుగా రాలేదన్నది సినిమా చూస్తున్న వాళ్ల అభిప్రాయం. షోకు ముందు హీరోగా మహేష్ 25 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తు చేస్తూ అభిమానులు ప్రత్యేకంగా తీర్చిదిద్దిన షో రీల్ అభిమానులను అమితంగా ఆకట్టుకుంది. ఇక సినిమాలో పాటలు.. కొన్ని సన్నివేశాలకు థియేటర్లలో రెస్పాన్స్ మామూలుగా లేదు. ఈ శుక్రవారం బోలెడన్ని కొత్త చిత్రాలు రిలీజైనా.. వాటికి చెప్పుకోదగ్గ స్పందన లేదు. కానీ ‘మురారి’ మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో మోత మోగించేస్తోంది.

Tags:    

Similar News