ఇంతకీ స్టార్ వారసుడి డెబ్యూ మూవీ ఉన్నట్టా.. లేనట్టా..?

ఎట్టకేలకు మూడు పదుల వయసులో మోక్షు డెబ్యూకి సంబంధించిన అధికారిక ప్రకటన రావడంతో అంతా ఖుషీ అయ్యారు.

Update: 2025-01-19 04:24 GMT

నటసింహం బాలకృష్ణ వారసుడి తెరంగేట్రం గురించి ఎన్నో ఏళ్లుగా వార్తలు వింటూనే ఉన్నాం. మోక్షజ్ఞను హీరోగా చూడాలని నందమూరి అభిమానులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు మూడు పదుల వయసులో మోక్షు డెబ్యూకి సంబంధించిన అధికారిక ప్రకటన రావడంతో అంతా ఖుషీ అయ్యారు. కానీ ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా, ముహూర్తం ఫిక్స్ చేసుకున్న సమయానికి ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలు జరుపుకోలేకపోయింది.

ముందుగా తన డైరెక్షన్ లోనే కుమారుడిని లాంచ్ చేయాలని భావించిన బాలయ్య.. చివరకు 'హను-మాన్' డైరెక్టర్ ప్ర‌శాంత్ వ‌ర్మ చేతుల మీదుగా హీరోగా పరిచయం చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. లాస్ట్ ఇయర్ మోక్షు బర్త్ డే స్పెషల్ గా సినిమాని అనౌన్స్ చేసి, ఓ స్టైలిష్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసారు. చెరుకూరి సుధాకర్, తేజస్విని నందమూరి నిర్మాణంలో ఈ చిత్రం రూపొందనుందని తెలిపారు. డిసెంబరు ఫస్ట్ వీక్ లో ఓపెనింగ్ చేయాలని అనుకున్నారు కానీ, వివిధ కారణాలతో ఆగిపోయింది.

మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ కొత్త ముహూర్తం ఎప్పుడా అని ఫ్యాన్స్ ఆలోచిస్తున్న టైంలో, అసలు ఈ సినిమా ఉంటుందా లేదా? అనే రూమర్లు మొదలయ్యాయి. మెయిన్ రీజన్ ఏంటనేది తెలియదు కానీ.. ఈ ప్రాజెక్ట్ పూర్తిగా ఆగిపోయిందని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం త్వరలోనే సెట్స్ మీదకు వస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్ స్టాపబుల్' టాక్ షోలో తాజాగా మోక్షు డెబ్యూ టాపిక్ వచ్చింది.

ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న బాలయ్య షోకి రామ్ చరణ్ గెస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే. అందులో పవన్ కల్యాణ్ పెద్ద కొడుకు అకిరా నందన్ తెరంగేట్రం గురించి అడిగారు బాలకృష్ణ. తాను కూడా తమ్ముడి డెబ్యూ కోసం వెయిట్ చేస్తున్నానని చెప్పిన చెర్రీ.. OG మూవీలో ఉన్నాడో లేదో తనకూ తెలియదని బదులిచ్చారు. ఆ వెంటనే పనిలో పనిగా మోక్షజ్ఞ లాంచింగ్ డేట్ చెప్పమని బాలయ్యను ప్రశ్నించారు చరణ్. దీనికి ఆయన నవ్వుతూ తల ఊపుతూ 'అతి త్వరలో' అని సమాధానమిచ్చారు.

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ఉంటుందని బాలయ్య చెప్పకపోవడంతో, ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేశారా? వేరే డైరెక్టర్ తో వెళ్తారా? అనే సందేహాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం టాక్ షోలో ప్రశాంత్ మూవీ నుంచి రిలీజ్ చేసిన మోక్షు పోస్టర్ ను ప్రదర్శించారు కాబట్టి.. త్వరలోనే ఈ సినిమా స్టార్ట్ అవుతుందని నమ్మకంగా ఉన్నారు. ఏదేమైనా ఏదొక అప్డేట్ ఇచ్చి పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఇకపోతే ప్రశాంత్ వర్మ సినిమా ప్రారంభం కాకపోవడానికి మోక్షజ్ఞ ఆరోగ్యం బాగాలేకపోవడమే కారణమని బాలయ్య ఆ మధ్య చెప్పారు. మేకర్స్ సైతం రూమర్స్ ను నమ్మొద్దు అంటూ ప్రకటన ఇచ్చారు. అయినా సరే ఆల్రెడీ అనౌన్స్ చేసిన ఈ ప్రాజెక్ట్ ఉండకపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. మరోపక్క 'హనుమాన్' వంటి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి ఏడాది గడుస్తున్నా, దర్శకుడు ఇంకా తన తదుపరి సినిమాని సెట్స్ మీదకు తీసుకురాలేకపోతున్నారు. 'జై హనుమాన్' చిత్రాన్ని లైన్ లో పెట్టారు కానీ, దానికింకా టైమ్ ఉంది. మరి త్వరలోనే ప్రశాంత్ నెక్స్ట్ మూవీ పట్టాలెక్కుతుందేమో చూడాలి.

Tags:    

Similar News