తమిళ యంగ్ హీరోతో మైత్రీ మూవీ మేక‌ర్స్ సినిమా

దాదాపు తెలుగులోని స్టార్ హీరోలంద‌రితో సినిమాలు చేసిన మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ రీసెంట్ గా పుష్ప‌2 తో నెక్ట్స్ లెవెల్ హిట్ ను అందుకున్న విష‌యం తెలిసిందే.

Update: 2025-02-17 07:59 GMT

మంచి అభిరుచి గ‌ల నిర్మాణ సంస్థ‌గా మైత్రీ మూవీ మేక‌ర్స్ పేరు పొందింది. శ్రీమంతుడు సినిమాతో త‌మ జ‌ర్నీని మొద‌లుపెట్టిన నిర్మాత‌లు అతి త‌క్కువ కాలంలోనే మంచి నిర్మాత‌లుగా పేరు తెచ్చుకున్నారు. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో ఉన్న పెద్ద నిర్మాణ సంస్థ‌ల్లో మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ కూడా ఒక‌టి. ఆ బ్యాన‌ర్ నుంచి సినిమా వ‌స్తుందంటే అంద‌రి దృష్టి దానిపైనే ఉంటుంది.

దాదాపు తెలుగులోని స్టార్ హీరోలంద‌రితో సినిమాలు చేసిన మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ రీసెంట్ గా పుష్ప‌2 తో నెక్ట్స్ లెవెల్ హిట్ ను అందుకున్న విష‌యం తెలిసిందే. బాక్సాఫీస్ వ‌ద్ద పుష్ప‌2 చేసిన హ‌డావిడి, హంగామా అంతా ఇంతా కాదు. ఈ సినిమా త‌ర్వాత మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ స్థాయి మ‌రికొంచెం పెరిగింద‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు.

ఓ వైపు సినిమాల‌ను నిర్మిస్తూనే మ‌రోవైపు డిస్ట్రిబ్యూష‌న్ లో కూడా మైత్రీ సంస్థ దూసుకెళ్తుంది. కేవ‌లం తెలుగులోనే కాకుండా త‌మిళంలో, హిందీలో కూడా త‌మ సంస్థ‌ను వ్యాపింప‌చేస్తున్నారు మైత్రీ నిర్మాత‌లు న‌వీన్, ర‌వి శంక‌ర్. ఇప్ప‌టికే త‌మిళంలో అజిత్ తో గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా తీస్తున్న మైత్రీ, హిందీలో స‌న్నీ డియోల్ తో జాత్ ను నిర్మిస్తుంది.

ఆల్రెడీ అజిత్ మూవీతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మైత్రీ సంస్థ ఇప్పుడు త‌మిళంలో ఓ యంగ్ హీరోతో సినిమా చేయ‌నుంది. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ హీరోగా ఓ సినిమాను చేస్తున్న‌ట్టు మైత్రీ నిర్మాత‌ల్లో ఒక‌రైన ర‌వి శంక‌ర్ అనౌన్స్ చేశారు. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన 20 రోజుల షూటింగ్ కూడా పూర్తైంద‌ట‌.

త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ తో పాటూ టైటిల్ ను రివీల్ చేయ‌నున్నామ‌ని, ప్ర‌దీప్ తో చేయబోయే క‌థ ఎంతో అద్భుతంగా ఉంటుంద‌ని నిర్మాత ర‌వి తెలిపారు. ఇది కాకుండా మైత్రీ బ్యాన‌ర్ లో ప్ర‌స్తుతం ప‌లు భారీ ప్రాజెక్టులు సెట్స్ పై ఉన్నాయి. ప్రభాస్- హ‌ను రాఘ‌వ‌పూడి సినిమాతో పాటూ, హ‌రీష్ శంక‌ర్- ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ కూడా ఇదే బ్యాన‌ర్ లో తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే.

Tags:    

Similar News