చివరి సినిమాకు మొదటి సినిమా టైటిల్‌?

ఇటీవల తమిళ నటుడు ఒకరు ఆ విషయాన్ని గురించి బాహాటంగానే వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇటీవల తమిళ నటుడు ఒకరు ఆ విషయాన్ని గురించి బాహాటంగానే వ్యాఖ్యలు చేయడం జరిగింది.

Update: 2025-01-24 06:30 GMT

తమిళ్‌ సూపర్‌ స్టార్‌ విజయ్‌ హీరోగా ప్రస్తుతం నటిస్తున్న సినిమాపై అంచనాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. విజయ్ ఇప్పటికే క్రియాశీలక రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం సిద్ధం అవుతున్నారు. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి పీఠంను దక్కించుకోవాలని ఆశ పడుతున్న విజయ్‌ చివరి సినిమాపై ఫ్యాన్స్‌లో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అధికారికంగా ప్రకటించకున్నా విజయ్‌ చివరి సినిమా తెలుగు సూపర్‌ హిట్‌ మూవీ 'భగవంత్‌ కేసరి'కి రీమేక్‌ అని తెలుస్తోంది. దర్శకుడు అనిల్‌ రావిపూడితో పలు సార్లు ఆ సినిమా మేకర్స్ చర్చలు జరిపారని కూడా సమాచారం అందుతోంది.

ఇటీవల తమిళ నటుడు ఒకరు ఆ విషయాన్ని గురించి బాహాటంగానే వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాంతో విజయ్ చివరి సినిమా కచ్చితంగా భగవంత్‌ కేసరి కి రీమేక్‌ అని కన్ఫర్మ్‌ అయ్యింది. మెయిన్‌ స్టోరీ లైన్‌ తీసుకుని తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా స్క్రీన్‌ ప్లేను నడిపించి ఉంటారని తెలుస్తోంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న విజయ్‌ 69 సినిమాకు టైటిల్ ఏంటి అనే విషయమై ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. దసరా కానుకగా రాబోతున్న ఆ సినిమాకు 'నాలయ తీర్పు' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. నాలయ తీర్పు అంటే తెలుగులో రేపటి తీర్పు అని అర్థం వస్తుంది.

భగవంత్‌ కేసరి కథకి రేపటి తీర్పు అనే టైటిల్‌ సరిగ్గా సెట్‌ అవుతుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ టైటిల్‌ పెట్టడం వెనుక మరో కారణం ఉందనే వార్తలు వస్తున్నాయి. కోలీవుడ్‌ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం విజయ్‌ నటుడిగా కనిపించిన మొదటి సినిమా 'నాలయ తీర్పు'. తన తండ్రి చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమాతోనే విజయ్‌ పరిచయం అయ్యాడు. 18 ఏళ్ల వయసులోనే హీరోగా పరిచయం అయిన విజయ్ తక్కువ సమయంలోనే స్టార్‌డం దక్కించుకున్నాడు. ఆ సినిమా విజయ్‌ కి చాలా సెంటిమెంట్‌.

అలాంటి సినిమా టైటిల్‌తో చివరి సినిమాను తీసుకు వస్తే కచ్చితంగా ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. విజయ్ ఫ్యాన్స్ ఈ సినిమాను ఆదరిస్తారనే నమ్మకం వ్యక్తం అవుతోంది. విజయ్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తోంది. శ్రీలీల పోషించిన పాత్రను మలయాళ కుట్టి మమిత బైజు పోషిస్తుంది. ఈ సినిమా విజయ్‌కి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది చూడాలి. మొదటి సినిమా టైటిల్‌తో చివరి సినిమాను చేయడం వల్ల ఫ్యాన్స్‌ ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవుతారనే ఉద్దేశ్యంతో టైటిల్‌ విషయమై చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే టైటిల్‌ను ప్రకటించి టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

Tags:    

Similar News