నందమూరి వేడుకకు దూరంగా తారక్?
ఎన్టీఆర్ శతజయంతి వేడుకలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆయన ఫోటోతో 100 రూపాయిల నాణేన్ని విడుదల చేయనుంది
నందమూరి ఫ్యామిలీలో తారక్, బాలయ్య మధ్య దూరం ఉందనే మాట చాలా కాలంగా వినిపిస్తోంది. అయితే దీనిని ఎవరూ పెద్దగా హైలైట్ చేయకపోయిన ప్రత్యేకంగా ఫ్యామిలీ అందరూ కలిసి పాల్గొనాల్సిన కార్యక్రమాలు జరిగే సమయం మాత్రం బయటపడిపోతూ ఉంటాయి. అలాగే మరోసారి నందమూరి కుటుంబంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి వంద సందేహాల్ని కలిగించారు.
ఎన్టీఆర్ శతజయంతి వేడుకలలో భాగంగా కేంద్రప్రభుత్వం ఆయన ఫోటోతో 100 రూపాయిల నాణేన్ని విడుదల చేయనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ ఆవిష్కరణ జరగనుంది. నిజంగా నందమూరి అభిమానులు అందరికి ఇది పండగలాంటి వార్త. జూనియర్ ఎన్టీఆర్ కి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం అందింది. అయితే అతను మాత్రం రావడం లేదు.
ఎన్టీఆర్ నాణెం విడుదల సందర్భంగా అయిన బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఒకే వేదికపైకి వస్తారని అందరూ భావించారు. గత కొద్దిరోజులుగా ఇదే ప్రచారం నడుస్తోంది. ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, పురందరేశ్వరి హాజరుకానున్నారు. ఢిల్లీలో జరగనున్న ఈ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ కి ఆహ్వానం అందింది. దీంతో తారక్ ఈ కార్యక్రమంలో కచ్చితంగా పాల్గొంటాడని అందరూ భావించారు.
మరి సడెన్ గా ఏమైందో ఏమో కానీ దేవర షూటింగ్ కారణంగా ఎన్టీఆర్ 100 రూపాయిల నాణెం విడుదల కార్యక్రమంలో పాల్గొనలేకపోతున్నట్లు తారక్ ప్రకటించారు. దీంతో అభిమానులకి షాక్ తగిలినట్లు అయ్యింది. గతంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ ని ఆహ్వానించినా ఇద్దరూ వెళ్ళలేదు. అప్పుడు కూడా ఇతర కార్యక్రమాలకి డేట్స్ ఇచ్చేయడంతో హాజరుకాలేనని ప్రకటించారు.
ఇప్పుడు మరల సీనియర్ ఎన్టీఆర్ ఫోటోతో నాణెం ముందించి విడుదల చేసే వేడుక అంటే నందమూరి అభిమానులు అందరూ గొప్పగా చెప్పుకునేది. అలాంటి ఈవెంట్ లో పాల్గొనే అవకాశం తారక్ కి వచ్చిన కూడా దేవర షూటింగ్ కారణం చూపించి వెళ్ళకపోవడం పలు సందేహాలకు తావిస్తోంది. మరి వీటికి తారక్, బాలయ్య ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడతారనేది వేచి చూడాలి.