పసివాడి ప్రాణం సీక్వెల్ కథతో?
తాజా సమాచారం మేరకు.. సల్మాన్ ఈ సినిమా సీక్వెల్ ని పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు.;

మెగాస్టార్ చిరంజీవి నటించిన `పసివాడి ప్రాణం` 1987లో విడుదలై బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఏ.కోదండరామిరెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా క్లీన్ ఫ్యామిలీ డ్రామా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రక్తి కట్టిస్తుంది. ఈ చిత్రం కథాంశం ఆద్యంతం ఆసక్తికరం.
మాట్లాడలేని, వినపడని ఒక పిల్లాడి (బేబి సుజిత) తల్లిదండ్రులను వేణు (రఘువరన్) అతడి స్నేహితుడు కలసి హత్య చేస్తారు. మూగసాక్షి అయిన ఆ పిల్లాడిని కూడా అంతం చేయాలనుకొన్న వారి నుండి ఆ బాలుడు తప్పించుకు పారిపోతాడు. పెళ్ళి జరిగిన రోజునే ప్రేయసి (సుమలత)ని కోల్పోయిన పెయింటర్ మధు (చిరంజీవి) తాగుబోతుగా మారతాడు. రోడ్డుపై నిద్రపోతున్న ఆ బాలుడిని చేరదీసి రాజాగా పిలుచుకొంటుంటాడు. ఆ బాలుడి ద్వారా మధుకి గీత (విజయశాంతి) అనే యువతి పరిచయం అవుతుంది. మధుని ప్రేమిస్తూ ఉంటుంది.
రాజాని వెదుకుతూ మధు ఇంటికి వచ్చి బాబుని చంపాలని చుస్తాడు వేణు స్నేహితుడు. తప్పతాగి మైకంలో పడి ఉన్న మధు చివరి నిముషంలో బాబుని రక్షించుకొంటాడు. బాబుని చంపటానికి వచ్చిన వ్యక్తి ముఖచిత్రాన్ని గీసి బాబు నుండి నిజాలను రాబట్టే ప్రయత్నం చేస్తూంటాడు మధు. జంట హత్యలు, బాలుడి అపహరణ కేసుని మధు పై మోపుతాడు విలన్. ఆ కేసుల్ని విచారిస్తున్న పోలీసు ఇన్స్ పెక్టర్ (కన్నడ ప్రభాకర్) చివరికి నిజమైన విలన్ ని కనిపెట్టాడా లేదా? అన్నదే సినిమా. రాజా తన అక్క కొడుకే అని తెలుసుకొంటుంది గీత. ద్రోహులని మధు ఎలా కనిపెట్టాడన్నదే చిత్రంలోని తరువాయి కథ.
అయితే ఈ సినిమా థీమ్ ని కాశ్మీర్ బార్డర్ కి మార్చి `బజరంగి భాయిజాన్` పేరుతో అద్భుతమైన సినిమాని తీసారు కబీర్ ఖాన్. ఈ సినిమాకు కథను అందించింది విజయేంద్ర ప్రసాద్. సల్మాన్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. తాజా సమాచారం మేరకు.. సల్మాన్ ఈ సినిమా సీక్వెల్ ని పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. కొన్నేళ్లుగా ఫ్లాపుల్ని ఎదుర్కొంటున్న సల్మాన్ కి ఇటీవలే మురుగదాస్ `సికందర్` రూపంలో మరో ఫ్లాపిచ్చాడు. దీంతో ఇప్పుడు తన బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ ని రూపొందించేందుకు సల్మాన్ సిద్ధమవుతున్నాడని తెలుస్తోంది. కబీర్ ఖాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించే ఉంది. ప్రస్తుతం విజయేంద్ర ప్రసాద్ తో సీక్వెల్ కి సంబంధించిన కథా చర్చలు సాగుతున్నాయని కూడా తెలుస్తోంది. పసివాడి ప్రాణం స్ఫూర్తితోనే భాయిజాన్ కథను రాసానని అప్పట్లో విజయేంద్ర ప్రసాద్ అన్నారు. అందుకే ఇప్పుడు పసివాడి ప్రాణం సీక్వెల్ తరహా కథాంశాన్ని భాయిజాన్ 2 కోసం ఆయన రెడీ చేస్తున్నారని భావించాలి.