ప్రశాంత్ వర్మతో బాలీవుడ్ హీరో.. అంతా అనుకున్నట్లే..
ఆ తర్వాత తాను చేసే సినిమాలు అన్నీ పీవీసీయూ (ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్)లో భాగంగానే ఉంటాయని కూడా క్లారిటీ ఇచ్చారు
అ!, జాంబిరెడ్డి వంటి పలు చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ ఏడాది హనుమాన్ మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తాను చేసే సినిమాలు అన్నీ పీవీసీయూ (ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్)లో భాగంగానే ఉంటాయని కూడా క్లారిటీ ఇచ్చారు. అదే సమయంలో బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తో మూవీ అనౌన్స్ చేశారు.
అయితే.. కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని వార్తలు వస్తున్నాయి. హీరో, దర్శకుడు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని, దీంతో ఎవరి దారి వారు చూసుకున్నారని టాక్ వినిపించింది. అయితే ఇటీవల ప్రశాంత్ వర్మ వాటిని ఖండించారు. రణవీర్ లుక్ టెస్ట్ కూడా కంప్లీట్ అయినట్లు చెప్పారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి సంచలన ప్రకటన వెలువడింది.
ఈ ప్రాజెక్ట్ కు ఇది సరైన సమయం కాదని మైత్రీ మూవీ మేకర్స్, ప్రశాంత్ వర్మ, రణవీర్ సింగ్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఒకరి వర్క్ పట్ల ఒకరికి అపారమైన గౌరవం ఉన్నట్టుగా రణవీర్, ప్రశాంత్ లు చెప్పుకున్నట్టుగా ఈ ప్రెస్ నోట్ ద్వారా రివీల్ అయ్యింది. ఇప్పటిలో ఈ కాంబినేషన్ లో సినిమా ఉండబోదని భవిష్యత్తులో కూడా ఉంటే ఉండవచ్చని తెలుస్తుంది. మొత్తానికి అయితే ఈ క్రేజీ కాంబినేషన్ లో ప్రస్తుతానికి ఎలాంటి మూవీ లేదు.
ప్రెస్ నోట్ ప్రకారం.. ‘‘ప్రశాంత్ ది చాలా ప్రత్యేకమైన టాలెంట్. మేమిద్దరం కలిసి ఒక సినిమా చేయాలని అనుకున్నాం. భవిష్యత్తులో ఆ ఎక్సైటింగ్ ప్రాజెక్టు కోసం సహకరిస్తాం" అని రణవీర్ సింగ్ చెప్పారు. ''రణవీర్ కు ఉన్న ఎనర్జీ, టాలెంట్ చాలా అరుదు. భవిష్యత్తులో ఎప్పుడో ఒకప్పుడు మేము కలిసి వర్క్ చేస్తాం" అని ప్రశాంత్ వర్మ తెలిపారు.
అలా.. ఇప్పటి వరకు వచ్చిన రూమర్స్ నిజం అయ్యాయి. రణవీర్, ప్రశాంత్ వర్మ కాంబోలో ప్రస్తుతానికి ఎలాంటి మూవీ లేనట్లే. దీంతో ప్రశాంత్ వర్మ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. చాలా అంచనాలు పెట్టుకున్నామని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ.. జై హనుమాన్ మూవీతో బిజీగా ఉన్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ను మొదలు పెట్టనున్నారు.