రష్మిక ఈ ఏడాది మరో నాలుగు..!
పుష్ప 2 సినిమా వరల్డ్ బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ.2000 కోట్ల వసూళ్లు రాబట్టిన విషయం తెల్సిందే.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న 2023 చివర్లో రణబీర్ కపూర్‌తో కలిసి బాలీవుడ్ మూవీ 'యానిమల్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.1000 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇక గత ఏడాది డిసెంబర్‌లో వచ్చిన అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమాలోనూ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన విషయం తెల్సిందే. పుష్ప సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోగా, పుష్ప 2 సినిమా అంతకు మించిన విజయాన్ని సొంతం చేసుకుంది. పుష్ప 2 సినిమా వరల్డ్ బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ.2000 కోట్ల వసూళ్లు రాబట్టిన విషయం తెల్సిందే.
'పుష్ప 2' సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు దక్కించుకున్న రష్మిక మందన్న తాజాగా విక్కీ కౌశల్ హీరోగా నటించిన 'ఛావా' సినిమాతో మరోసారి తన సత్తా చాటింది. ఛావా సినిమాలో శంభాజీ మహారాజ్ భార్య యేసుబాయి పాత్రలో రష్మిక మందన్న నటించి మెప్పించింది. ఛావా సినిమా చూసిన వారు అంతా మహారాణి పాత్రలో రష్మిక నటన అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. విక్కీ కౌశల్‌కి పోటీగా రష్మిక మందన్న నటించింది అంటూ ప్రశంసలు దక్కించుకుంది. వరుసగా పుష్ప 2, ఛావా సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన రష్మిక మందన్న ఈ ఏడాది మరో నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది.
రష్మిక మందన్న యానిమల్ సినిమా తర్వాత బాలీవుడ్‌లో బిజీగా మారింది. ఇప్పటికే సల్మాన్ ఖాన్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సికిందర్ సినిమాలో రష్మిక మందన్న నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ ఏడాదిలోనే ఈద్ సందర్భంగా సికిందర్‌తో రష్మిక మందన్న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తమిళ్‌లో తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన 'కుబేరా' సినిమాలోనూ రష్మిక మందన్న నటించింది. ధనుష్ హీరోగా నాగార్జున ముఖ్య పాత్రలో నటించిన కుబేరా సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయని తెలుస్తోంది. ఇక గర్ల్ ఫ్రెండ్ అనే విభిన్నమైన లేడీ ఓరియంటెడ్ సినిమాలోనూ రష్మిక నటించింది.
కొన్ని రోజుల క్రితం గర్ల్ ఫ్రెండ్ సినిమా టీజర్ విడుదలైంది. విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్‌తో వచ్చిన ఆ టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. అందుకే గర్ల్ ఫ్రెండ్ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లోనే కాకుండా అన్ని భాషల ప్రేక్షకుల్లోనూ అంచనాలు భారీగా ఉన్నాయి. రష్మిక మందన్న మరో హిందీ సినిమా థమా సైతం ఇదే ఏడాదిలో దీపావళి సందర్భంగా విడుదల కాబోతుంది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్న థమా సినిమాపైనా అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నాలుగు సినిమాలతోనే కాకుండా విజయ్ దేవరకొండ హీరోగా శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న కింగ్డమ్ సినిమాలోనూ రష్మిక మందన్న నటించిందట. గెస్ట్ రోల్‌లో రష్మిక నటించినప్పటికీ కింగ్డమ్‌లో ఆమె పాత్ర కీలకంగా ఉంటుందని సమాచారం అందుతోంది.
ఇప్పటి వరకు కింగ్డమ్ మేకర్స్ రష్మిక గెస్ట్ అప్పియరెన్స్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ విజయ్ దేవరకొండ అభిమానులు మాత్రం రష్మిక గెస్ట్ పాత్రపై చాలా నమ్మకంగా ఉన్నారు. గెస్ట్ పాత్రను మించి రష్మిక పాత్ర ఉన్నా ఆశ్చర్యం లేదని కొందరు అంటున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న కింగ్డమ్ సినిమా టీజర్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేజీఎఫ్‌ను గౌతమ్ తిన్ననూరి తీస్తే ఎలా ఉంటుందో అదే కింగ్డమ్ సినిమా అంటూ కొందరు ఈ సినిమాపై అంచనాలు పెంచుతున్నారు. కింగ్డమ్‌లో రష్మిక ఉంటే కచ్చితంగా అంచనాలు రెట్టింపు కావడం ఖాయం. మొత్తానికి ఈ ఏడాదిలో రష్మిక నుంచి నాలుగు లేదా అయిదు సినిమాలు రావడం ఖాయం. మరి వాటి ఫలితాలు ఎలా ఉంటాయి అనేది చూడాలి.