'కంగువా' రిలీజ్ కు చిక్కులు.. కేసు క్లియర్ అయ్యేనా?
అయితే కంగువా సినిమా రిలీజ్ కు ఇప్పుడు చిక్కులు ఎదురయ్యాయి!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. కంగువా చిత్రంతో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. టైమ్ ట్రావెల్ ఫాంటసీ యాక్షన్ డ్రామాగా సిరుతై శివ తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమాను పదికి పైగా భాషల్లో విడుదల చేయనున్నారు. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. నవంబర్ సెకండ్ వీక్ లో రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు.
అయితే కంగువా సినిమా రిలీజ్ కు ఇప్పుడు చిక్కులు ఎదురయ్యాయి! మూవీ విడుదల నిలిపివేయాలని ప్రముఖ రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ మద్రాసు హైకోర్టును రీసెంట్ గా ఆశ్రయించింది. కంగువా నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ సంస్థ.. తమకు ఇవ్వాల్సిన మొత్తాన్ని చెల్లించకుండా కాంట్రాక్ట్ నిబంధనలను ఉల్లంఘించిందని కేసు వేసింది. మొత్తం డబ్బులు ఇచ్చాకనే సినిమా విడుదలకు అనుమతులు ఇవ్వాలని కోర్టును కోరింది. అసలు ఏం జరిగిందంటే?
స్టూడియో గ్రీన్ నిర్మాణ సంస్థ అధినేత కేఈ జ్ఞానవేల్ రాజా.. టెడ్డీ-2, ఎక్స్ మీట్స్ ఓయ్, తంగలాన్ తదితర సినిమాలను నిర్మించేందుకు రిలయన్స్ సంస్థ నుంచి రూ.99 కోట్లకు పైగా రుణం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకు గాను ఇప్పటి వరకు రూ.45 కోట్లు తిరిగి చెల్లించారట. ఇప్పుడు ఆ మిగిలిన రూ.55 కోట్లు చెల్లించకుండా కాంట్రాక్ట్ నిబంధనలు ఉల్లంఘించారని రిలయన్స్ సంస్థ.. మద్రాసు హైకోర్టులో కేసు దాఖలు చేసింది.
తమకు రావాల్సిన సొమ్ము అందే వరకు కంగువా థియేట్రికల్ రిలీజ్ తో పాటు తంగలాన్ ఓటీటీ విడుదలను నిలిపివేయాలని కోర్టును కోరింది. దీంతో ఈ వ్యాజ్యం జస్టిస్ కుమరేష్ బాబు ముందుకు విచారణకు వచ్చింది. ఆ సమయంలో నవంబర్ 7వ తేదీ వరకు తమకు సమయం కావాలని స్టూడియో గ్రీన్ కోర్టును కోరింది. అప్పటి వరకు కంగువాను విడుదల చేయమని చెప్పింది. తంగలాన్ చిత్రాన్ని కూడా నవంబర్ 7వ తేదీన వరకు ఓటీటీలోకి తీసుకురాబోమని పేర్కొంది.
దీంతో న్యాయమూర్తి.. కేసును నవంబర్ 7వ తేదీకి వాయిదా వేశారు. అయితే నవంబర్ 14వ తేదీన కంగువాను రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అందుకు గాను ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. ఇంతలో రిలయన్స్ సంస్థ కోర్టు మెట్లెక్కింది. దీంతో అనుకున్న తేదీ లోపు కేసు క్లియర్ అవ్వకపోతే.. కంగువా రిలీజ్ కు చిక్కులు తప్పవనే చెప్పాలి. మరేం జరుగుతుందో వేచి చూడాలి.