జీబ్రా: సత్యదేవ్ కాన్ఫిడెన్స్ ఏ లెవెల్లో ఉందంటే..
టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని అందుకున్న వారిలో సత్యదేవ్ ఒకరు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని అందుకున్న వారిలో సత్యదేవ్ ఒకరు. తన నటనా ప్రతిభతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక ఇంటర్వ్యూలో సత్యదేవ్‌కి హీరోగా పెద్ద హిట్ రావాలని కోరారు. ఇప్పుడు సత్యదేవ్ తన తదుపరి మల్టీ స్టారర్ మూవీ "జీబ్రా"తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ సినిమాలో ఆయనతో పాటు కన్నడ స్టార్ డాలీ ధనుంజయ, ప్రియ భవానీ శంకర్, సునీల్, జెన్నిఫర్ పిసినాటో, సత్య, సత్యరాజ్ లాంటి ప్రముఖులు నటిస్తున్నారు. ఈ నెల 22న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ చిత్రంపై సత్యదేవ్ మీడియాతో మాట్లాడారు. ఈ సినిమా లో భాగమైనందుకు తనను తాను చాలా అదృష్టవంతుడిగా భావిస్తున్నానని అన్నారు.
"జీబ్రా" అనే టైటిల్ సినిమా కంటెంట్‌ను అద్భుతంగా ప్రతిబింబిస్తుందని, ఇది బ్లాక్ అండ్ వైట్ మనీకి ఒక రూపకంగా ఉంటుందని వెల్లడించారు. దర్శకుడు ఈశ్వర్ కార్తిక్ కథ, స్క్రీన్‌ప్లే తీరు చాలా కొత్తగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని సత్యదేవ్ చెప్పారు. ఈశ్వర్ అనుకున్న కథను పర్ఫెక్ట్ గా తెరపైకి తీసుకురావడంలో విజయం సాధించాడని, ఇప్పటికే సినిమా చూసిన వారితో వచ్చిన సానుకూల స్పందన చూసి చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు.
ఈ చిత్రం నూతన థియేట్రికల్ అనుభవాన్ని అందిస్తూ భారీ విజయాన్ని అందుకునే అవకాశం ఉందని అన్నారు. ఇక సినిమా నిర్మాణం కోసం పద్మజ ఫిలిమ్స్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌ను ఖర్చు చేశారని సత్యదేవ్ ప్రశంసించారు. కథకు అవసరమైన స్థాయిలో వ్యయాన్ని చేయడంలో నిర్మాతలు వెనుకడుగు వేయలేదని తెలిపారు. ఈ సినిమా తన కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో నిర్మించిన చిత్రంగా నిలుస్తుందని చెప్పారు.
ఇక సంగీతంపై మాట్లాడుతూ, రవి బస్రూర్ కంపోజ్ చేసిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. పాటలతో పాటు సంగీతం కూడా కథను మరో లెవెల్ కు తీసుకెళ్లిందని అన్నారు. ఈ చిత్రం కథ, నటీనటులు, నిర్మాణ విలువలతో కొత్త అనుభవాన్ని ప్రేక్షకులకు అందిస్తుందని, సినిమా ఒక ప్రత్యేకమైన మైలురాయిగా నిలుస్తుందని సత్యదేవ్ నమ్మకంగా చెప్పుకొచ్చారు. మరి సత్యదేవ్ ఈ సినిమాతో ఏ స్థాయిలో సక్సెస్ అందుకుంటాడో చూడాలి.