SDT18: ఫస్ట్ షాట్ లోనే తగలబెట్టేశాడు
ఇక ఎట్టకేలకు ప్రాజెక్టుకు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది.
ఇటీవల కొంత గ్యాప్ తీసుకున్న సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ ఫైనల్ గా అత్యంత ప్రతిష్టాత్మకమైన "SDT 18" ప్రాజెక్టులో బిజీ అయ్యాడు. చాలా రోజులుగా ఈ సినిమా గురించి అనేక రకాల గాసిప్స్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఎట్టకేలకు ప్రాజెక్టుకు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. నూతన దర్శకుడు రోహిత్ కెపీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, ప్రముఖ నటి ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తున్నారు.
సాయి తేజ్ పుట్టినరోజు సందర్భంగా, చిత్ర బృందం సినిమా ప్రపంచాన్ని పరిచయం చేస్తూ SDT 18 నుంచి ఒక ఆసక్తికరమైన గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఈ టీజర్‌లో భారీ సెట్లతో పాటు, కాలానుగుణంగా ఉపయోగించిన ఆయుధాలు, ప్రత్యేకమైన ప్రాప్స్ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులను చేశాయి. టీజర్ చివర్లో సాయి తన బాడీతో కనిపించిన విధానం హైలెట్ గా నిలిచింది. భారీగా ఎగిసిపడుతున్న అగ్నికీలలను ఎదుర్కొంటూ కనిపించడం ప్రేక్షకుల ఊహలకు కొత్త పుంతలు తొక్కించింది.
మొదటి షాట్ చూస్తేనే బాక్సాఫీస్ తగలబడి పోయేలా ఉందని ఫ్యాన్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇక చిత్ర బృందం ఈ గ్లింప్స్ కేవలం మొదటిదశ మాత్రమేనని, మరిన్ని అద్భుతమైన అనుభవాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చింది. ఈ పాన్-ఇండియా చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇది అన్ని భాషల్లో ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కే. నిరంజన్ రెడ్డి మరియు చైతన్య రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ వెట్రి పలనిసామి ఈ ప్రాజెక్టుకు కెమెరా బాధ్యతలు చేపట్టడం విశేషం. "SDT 18" ఒక పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఉండబోతోంది. దీని కథలో న్యాయం, ప్రతీకారం, మరియు ఆదిమానవ జాతికి చెందిన కొన్ని ఆసక్తికర అంశాలు ఉండబోతున్నాయనే ఊహాగానాలు ఉన్నాయి. భారీ యాక్షన్ సన్నివేశాలు, గ్రాండ్ విజువల్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయట.
సాయి తేజ్ ఈ సినిమాలో తన నటనతో మరోసారి అభిమానుల మనసులను గెలుచుకోవడం ఖాయం. ఈ ప్రాజెక్టు గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉన్నప్పటికీ, విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులలో ఆసక్తిని పెంచింది. చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. "SDT 18" పాన్-ఇండియా స్థాయిలో ప్రేక్షకులకు విభిన్న అనుభవాన్ని అందించే సినిమా అవుతుందనే నమ్మకం వ్యక్తమవుతోంది. దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు సమాచారం.